AHA: తెలుగు ఇండియన్ ఐడల్’ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలోని సింగర్స్ తమ ప్రతిభాపాటవాలను చాటుకునే ఛాన్స్ దొరికింది. సీజన్ 1 సూపర్ హిట్ కావడంతో తాజాగా నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్ -2’ వేదికపై దీనికి కూడా సీజన్ 2 ఉంటుందని ఆహా నిర్వాహకులు ప్రకటించారు. సీజన్ 1 తరహాలోనే దీనికి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న 16 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న యువతీ యువకులు ఈ ఆడిషన్స్ కు హాజరు కావచ్చు. హైదరాబాద్ లో ఈ నెల 29న మెగా ఆడిషన్స్ జరుగబోతున్నాయి. దీనికి బషీర్ బాగ్ లోని సెయింట్ జార్జి గర్ల్స్ గ్రామర్ స్కూల్ వేదిక కాబోతోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, బ్యూటీఫుల్ హీరోయిన్ నిత్యా మీనన్, పాపులర్ సింగర్ కార్తిక్ ‘తెలుగు ఇండియన్ ఐడల్’కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆ సీజన్ లో బి.వి.కె. వాగ్దేవి విజేతగా నిలువగా రన్నరప్ గా శ్రీనివాస్, వైష్ణవి ఉన్నారు. ఈ సీజన్ లో పాల్గొన్న పలువురు సింగర్స్ కు సంగీత దర్శకులు తమ చిత్రాలలో పాటలు పాడే ఛాన్స్ కూడా ఇచ్చారు. దాంతో సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని వేలాది మంది ఎదురుచూస్తూ ఉన్నారు. సో… వారందరి కోరిక తీరే రోజు ఇక ఎంతో దూరంలో లేదు!