Rain Alert : నగర శివారులోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షం వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర అవస్థలు సృష్టించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపు నీరు నిలిచడంతో రోడ్ల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే మూడు రోజులలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వాతావరణ కేంద్రం ప్రకటనలో, ఈ నెల 25 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో 26వ తేదీకి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా, 27వ తేదీకి అదే ప్రాంతంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. వీటికి అనుగుణంగా రాబోయే రోజులలో రాష్ట్రంలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం సూచించింది. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిని ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీనగర్ స్టేడియంలో జరుగుతోంది. అయితే.. ఈ ఈవెంట్ పరిసర ప్రాంతాల్లోనే భారీ వర్షం కురియడంతో ఓజీ ఈవెంట్ సేఫేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది.