మూవీ మొఘల్, స్వర్గీయ రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ మరింత ఆలస్యం అయ్యేట్టుగా ఉంది. అతను హీరోగా నటించిన తొలి చిత్రం ‘అహింస’ నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కరోనా టైమ్ లో మొదలైన ఈ సినిమా అనివార్య కారణాలతో చాలా ఆలస్యంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. తొలి కాపీ సిద్ధం చేసుకున్న ‘అహింస’ ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నట్టు నెల రోజుల క్రితమే చిత్ర నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత పి. కిరణ్ తెలిపారు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గీతిక తివారి హీరోయిన్ గా నటించింది. సదా, రజత్ బేడీ, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, దేవిప్రసాద్, కల్పలత తదితరలు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ స్వరాలు అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని, అనిల్ అచ్చుగట్ల సంభాషణలు సమకూర్చారు. అయితే ముందు అనుకున్నట్టు ‘అహింస’ ఏప్రిల్ 7న వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ టీజర్, అలానే రెండు పాటలు వచ్చాయి. సినిమా మీద ఓ మోస్తరు అంచనాలను క్రియేట్ చేశాయి. కానీ గత కొద్ది రోజులుగా దర్శక నిర్మాతలు ప్రచారం విషయంలో వ్యూహాత్మక మౌనం వహించడంతో వాళ్ళు ‘అహింస’ విడుదలను వాయిదా వేశారనే అనిపిస్తోంది.
నిజానికి 7వ తేదీ ‘అహింస’ మూవీని విడుదల చేయాలనుకుంటే… ఇప్పటికే మరిన్ని పాటలను జనం ముందుకు తీసుకొచ్చే వారు. మరో వైపు ఈ వారం రాబోతున్న రవితేజ ‘రావణాసుర’, కిరణ్ అబ్బవరం ‘మీటర్’ చిత్రాల ప్రచారం జోర్దార్ గా సాగుతోంది. ఇవన్నీ చూస్తుంటే… ఈవారం ‘అహింస’ రాదనేది ఖాయంగా అనిపిస్తోంది. అయితే ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనే సందేహమూ కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే… ఏప్రిల్ రెండోవారంలో ‘శాకుంతలం, రుద్రుడు, ఆగస్ట్ 16, 1947’ సినిమాలు విడుదల కాబోతున్నాయి. మూడో వారంలో ‘విరూపాక్ష’ ఉంది. ఇక చివరి వారంలో ‘ఏజెంట్, పొన్నియన్ సెల్వన్ -2’ చిత్రాలు రాబోతున్నాయి. మరి ఈ మధ్యలో ఏ వారంలో ‘అహింస’ను రిలీజ్ చేస్తారో చూడాలి.