IND Vs BAN: మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌటైంది. దీంతో 87 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రిషబ్ పంత్ (93), శ్రేయస్ అయ్యర్ (87) సెంచరీలు మిస్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ రాణించకపోయి ఉంటే టీమిండియా పరిస్థితి దారుణంగా ఉండేది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (10), శుభ్‌మన్ గిల్ (20) విఫలం అయ్యారు. స్టార్ ఆటగాళ్లు పుజారా (24), విరాట్ కోహ్లీ (24) రాణించలేకపోయారు. అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ 93 పరుగులతో అదరగొట్టాడు. అతడు 104 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 పరుగులు రాబట్టాడు. పంత్‌కు శ్రేయస్ అయ్యర్ కూడా చక్కటి సహకారం అందించాడు.
శ్రేయస్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 87 పరుగులు మాత్రమే చేశాడు. అయితే పంత్, శ్రేయస్ ఇద్దరూ సెంచరీలు చేయకపోవడం అభిమానులను నిరాశపరిచింది. వీళ్లిద్దరూ ఐదో వికెట్‌కు 159 పరుగులు జోడించి టీమిండియాను ఆదుకున్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్, తైజుల్ ఇస్లామ్‌లకు చెరో 4 వికెట్లు పడ్డాయి. టస్కిన్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్‌కు తలో ఒక వికెట్ పడింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 పరుగులకు ఆలౌటైంది.