Nandamuri Balakrishna: నటరత్న యన్టీఆర్ కు ఏడుగురు కొడుకులు ఉన్నా, వారిలో హరికృష్ణ, బాలకృష్ణనే ఆయన నటవారసత్వం స్వీకరించారు. అందునా బాలకృష్ణనే తండ్రిలాగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. సదా తన తండ్రినే స్మరించే బాలకృష్ణకు సెంటిమెంట్స్ ఎక్కువ. శ్రీవేంకటేశ్వర స్వామి నందమూరి వారి కులదైవం. నటరత్న తమ నిర్మాణ సంస్థ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో వేంకటేశ్వర స్వామి బొమ్మకు అటూ ఇటూ శ్రీదేవి, భూదేవిని కూర్చోబెట్టి తన తమ్ముడు త్రివిక్రమరావు పూజ చేస్తున్నట్టు చూపించేవారు. అలా వైష్ణవుడైన యన్టీఆర్ మనసు తరువాతి రోజుల్లో శైవానికీ మళ్ళింది. దాంతోనే ఆయన విభూతి పెట్టుకోసాగారు. ఆ తరువాత రాజకీయాల్లోనూ విజయభేరీ మోగించారు. అలా తండ్రి నుండి బాలకృష్ణకు సైతం భక్తి ప్రపత్తులు వంటబట్టాయి. తండ్రిలాగే రోజూ ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని పూజలు చేస్తూ ఉంటారు బాలకృష్ణ. ఆయనకు సూర్యభగవానుడు ఇష్టదైవం. ఆదిత్య హృదయాన్ని పటిస్తూ ఉంటారు. అలాగే మన పురాణాల్లోని శ్లోకాలనూ సమయానుకూలంగా మననం చేసుకుంటారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, ఎవరైనా ప్రమాదం బారిన పడ్డా ‘మృత్యుంజయ మంత్రాన్ని’ పఠించడం హైందవ సంప్రదాయం! బాలకృష్ణ కూడా అదే తీరున సమయానుకూలంగా ఆ మంత్రాన్ని పఠిస్తూంటారు.
జనవరి 27న నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కుప్పకూలిన సమయంలో బాలకృష్ణ కూడా అక్కడే ఉన్నారు. హుటాహుటిన కుప్పంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తారకరత్నకు చికిత్స ఆరంభించారు. ఆరంభంలో దాదాపు 45 నిమిషాల పాటు తారకరత్న పల్స్ దొరకలేదు. దాంతో వైద్యులు సైతం చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఆ సమయంలో తారకరత్న బాబాయ్ అయిన బాలకృష్ణ ఆయన శరీరాన్ని కాసేపు కుదిపారు. తరువాత తారకరత్న చెవిలో ‘మృత్యుంజయ మంత్రాన్ని’ పఠించారు. ఆ మంత్రప్రభావం వల్లే తారకరత్నలో మళ్ళీ రక్తప్రసరణ జరిగిందని ఇప్పుడు అందరూ విశేషంగా చెప్పుకుంటున్నారు. అప్పుడే ‘పల్స్’ దొరకడంతో డాక్టర్లు వైద్యం ఆరంభించారని తెలుస్తోంది. ‘అఖండ’ చిత్రంలో అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ సినిమాలో సనాతన ధర్మం ప్రాధాన్యతను, గొప్పతనాన్ని చాటారు. అందులో తన సోదరుని కూతురు ప్రాణాన్ని రక్షించడానికి ‘మృత్యుంజయ హోమం’ చేసేలా నటించారు. అదే తీరున నిజజీవితంలో తన అన్న మోహనకృష్ణ కుమారుడు తారకరత్న ప్రమాదంలో ఉండగా అతని చెవిలో ‘మృత్యుంజయ మంత్రం’ పఠించారు. దాంతోనే తారకరత్నలో రక్తప్రసరణ మొదలయిందని ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. పాత్రలో లీనం కావడమే కాదు, నిజజీవితంలోనూ బాబాయ్ గా బాలయ్య తన ధర్మం నిర్వర్తించారని అభిమానులు అభినందిస్తున్నారు.