Vishal: కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో విశాల్ ఒకడు. నడిఘర్ సంఘానికి బిల్డింగ్ కట్టేవరకు విశాల్ పెళ్లి చేసుకోనని శపథం చేసిన విషయం కూడా తెల్సిందే. గత కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ అమ్మాయి అనీషాతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నది కూడా అందుకే అని టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం కెరీర్ మీద ఫోకస్ పెట్టిన విశాల్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం విశాల్ లాఠీ, డిటెక్టివ్ 2 చిత్రాలలో నటిస్తున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే విశాల్ ప్రేమలో ఉన్నాడు అనే వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే. విశాల్ కూడా ఒక ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్నాను అని, త్వరలోనే ఆ అమ్మాయి ఎవరో చెప్తాను అని చెప్పుకొచ్చాడు. దీంతో ఆమె ఎవరు అని నెటిజన్లు ఆరాతీయడం మొదలుపెట్టారు.
ఇక తాజాగా విశాల్ ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 11 పేద జంటలకు వివాహం జరిపించాడు. దగ్గర ఉండి వారి పెళ్లిళ్లకు పెద్దగా అన్ని సమకూర్చాడు. ఈ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ తన పెళ్లి గురించి కొత్త ముచ్చట చెప్పుకొచ్చాడు. ఇక్కడ పెళ్లి చేసుకున్న జంటలు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకున్న విశాల్.. తన పెళ్లి కూడా త్వరలోనే జరగనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక పెద్దలు కుదిర్చిన వివాహం తనకు సెట్ కాదని, కచ్చితంగా ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తానని స్పష్టం చేశాడు. తాను ఆల్రెడీ ప్రేమలో ఉన్నానని, త్వరలోనే ఆ అమ్మాయిని పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అంటే ఒకసారి పెద్దలు కుదిర్చిన వివాహం ఫెయిల్ అయ్యిందని విశాల్ ఇలా అనుకోని ఉండొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.