ఎప్పటికప్పుడు వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు యంగ్ హీరో సుధీర్ బాబు. కృష్ణ లాంటి సీనియర్ స్టార్ అల్లుడు, ఇప్పటి టాప్ హీరో మహేశ్ బాబు బావమరిది అయినా సుధీర్ ఏ రోజునా, భేషజాలకు పోలేదు. తన మనసుకు నచ్చితే చిన్న పాత్రలోనైనా నటించడానికి వెనుకాడలేదు సుధీర్. అలా కొన్ని చిత్రాలలో కేమియో రోల్స్ లోనూ అలరించారు సుధీర్. విలక్షణంగా కనిపించాలని సుధీర్ తపించే తీరుకు ఆయన నటించిన ‘హంట్’ చిత్రమే పెద్ద నిదర్శనం. అందులో ‘గే’గా నటించి సుధీర్ నటునిగా మంచి మార్కులు సంపాదించారు. అయితే చిత్రం అంతగా అలరించక పోవడంతో ఆయన చేసిన ప్రయత్నం గుర్తింపు పొందలేకపోయింది. ఇప్పటికీ అదే తీరున వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు పోతున్నారు సుధీర్ బాబు.
సుధీర్ బాబు 1980 మే 11న విజయవాడలో జన్మించారు. చిన్నప్పటి నుంచీ ఆటపాటలంలే ఎక్కువ ఇష్టం. సినిమా రంగంలో అడుగుపెట్టక ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రాణించారు సుధీర్. ఎంతోమంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ను తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్ తో కలసి డబుల్స్ ఆడేవారు సుధీర్. నటశేఖర కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శినిని పెళ్ళాడిన సుధీర్ కు అనుకోకుండా సినిమాలపై ఆసక్తి కలిగిందని చెప్పవచ్చు. తన భార్య ఇంటిలో ఆమె తండ్రి, అన్నలు, అక్క మంజుల అందరూ నటనలో ప్రవేశమున్నవారే. దాంతో సుధీర్ మనసు కూడా యాక్టింగ్ వైపు సాగింది. తన వదిన మంజుల ఘట్టమనేని నిర్మించిన ‘ఏ మాయ చేశావే’తో సుధీర్ తొలిసారి తెరపై కనిపించారు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో రూపొందిన ‘ఏ మాయ చేశావే’ లో సమంత అన్నగా సుధీర్ నటించారు. ఓ సీన్ లో హీరో నాగచైతన్యతో ఫైట్ కూడా చేశారు. ఆ తరువాత ‘శివ మనసులో శ్రుతి’ (ఎస్.ఎమ్.ఎస్.) సినిమాలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుధీర్. ఈ చిత్రంలోనే ఫైట్స్, డాన్సులతో ఆకట్టుకున్నారు సుధీర్.
సుధీర్ కు తొలి రెండు సినిమాలు నటునిగా మార్కులయితే సంపాదించి పెట్టాయి. కానీ, అతను ఆశించిన విజయం దరి చేరలేదు. సినిమాటోగ్రాఫర్ జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మారుతి నిర్మించిన ‘ప్రేమ కథాచిత్రమ్’ సుధీర్ బాబు ఆశించిన విజయాన్ని అందించింది. తక్కువ పెట్టుబడితో రూపొందిన ‘ప్రేమకథా చిత్రమ్’ మంచి లాభాలను చూసింది. ఇందులో తన మామ కృష్ణ హీరోగా నటించిన ‘పచ్చని కాపురం’లోని “వెన్నెలైనా చీకటైనా…” సాంగ్ రీమిక్స్ లో నటించి అలరించారు సుధీర్. ‘ప్రేమకథాచిత్రమ్’ ఘనవిజయం తరువాత సుధీర్ బాబుకు పలు అవకాశాలు పలకరించాయి. అయితే ఆచి తూచి అడుగేస్తూ తన పర్సనాలిటీకి తగ్గ పాత్రలనే ఎంచుకున్నారు సుధీర్. “ఆడు మగాడ్రా బుజ్జి, క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే” వంటి చిత్రాలలో సోలో హీరోగా ఆకట్టుకున్న సుధీర్, “శమంతకమణి, వీరభోగవసంతరాయలు, వి” చిత్రాలలో ఇతర హీరోలతోనూ కలసి నటించి అలరించారు. వీటిలో ‘నన్ను దోచుకుందువటే’ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించారు సుధీర్. మేచో మేన్ లుక్ ఉన్న సుధీర్ బాబుకు హిందీలో ‘బాఘీ’ చిత్రంలో విలన్ గా నటించే అవకాశం లభించింది. తెలుగులో విజయం సాధించిన ‘వర్షం’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించాడు. ‘బాఘీ’లో టైగర్ కు తగ్గ విలన్ అనిపించుకున్నారు సుధీర్. తగిన పాత్ర దొరకాలే కానీ, తన సత్తా చాటుకుంటానని పలుమార్లు నిరూపించుకున్నారు సుధీర్. ‘హంట్’లో విలక్షణమైన పాత్రలో కనిపించిన సుధీర్ కు ఆ చిత్రం నిరాశ కలిగించింది. ప్రస్తుతం ‘మామా మశ్చీంద్ర’లో నటిస్తున్నారాయన. ఎప్పటి నుంచో తన బ్యాడ్మింటన్ గురువు పుల్లెల గోపీచంద్ జీవితగాథ ఆధారంగా ఓ సినిమా తీయాలని తపిస్తున్నారు సుధీర్ బాబు. మరి అది ఎప్పటికి పూర్తిచేస్తారో? ఏది ఏమైనా విలక్షణమైన పాత్రల్లో వైవిధ్యం ప్రదర్శిస్తూ సాగుతున్న సుధీర్ బాబు రాబోయే చిత్రాలతో అలరిస్తారని ఆశిద్దాం.