Taapsee Pannu On Koffee With Karan Show: తమ సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా.. నటీనటులు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు పలు కార్యక్రమాలకి హాజరవుతుంటారు. ముఖ్యంగా.. బాగా పాపులర్ అయిన షోలకి తప్పకుండా వెళ్తారు. అయితే.. ఆగస్టు 19వ తేదీన రిలీజవుతున్న తన ‘దొబారా’ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు, ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి తాప్సీ పన్ను ఎందుకు వెళ్లలేదన్నది బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆమెకి అందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ‘మీరెందుకు మీ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లలేదు’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.
అందుకు తాప్సీ ఇచ్చిన బోల్డ్ సమాధానం విని, అందరూ షాక్‌కి గురయ్యారు. ‘‘ఆ కార్యక్రమం నుంచి ఆహ్వానం అందుకునేంత ఆసక్తికరంగా నా శృంగార జీవితం లేదు’’ అంటూ ఘాటు బదులిచ్చింది. కాఫీ విత్ కరణ్ షోలో హోస్ట్ కరణ్ జోహర్ ఎక్కువగా శృంగారానికి సంబంధించిన ప్రశ్నలే సంధిస్తుంటాడు. ‘మీరు ఏ వయసులో వర్జినిటీ కోల్పోయారు? మీ రొమాంటిక్ పార్ట్నర్ ఎవరు? చివరిసారిగా ఎప్పుడు పడకసుఖం పొందారు? ఇలా శృంగారం చుట్టే విపరీతమైన ప్రశ్నలు వేస్తుంటాడు. రీసెంట్‌గా విజయ్ దేవరకొండను సైతం అలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు కరణ్. అందుకు కౌంటర్‌గా తాప్సీ పై విధంగా సెటైరికల్ జవాబు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి, దీనిపై కరణ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
కాగా.. తాప్సీ నటించిన ‘దొబారా’, స్పానిష్ చిత్రం ‘మిరాజ్’కి రీమేక్. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకుడు. ఈ చిత్రాన్ని లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ & ఫాంటాసియా ఫిల్మ్ పెస్టివల్ 2022లో ప్రదర్శించబడింది. ఆగస్టు 19న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ప్రయోగాత్మక చిత్రాలకు తాప్సీ బ్రాండ్ ఎంబాసిడర్ కాబట్టి.. ఈ సినిమాతోనూ హిట్ కొడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.