సంగీత దర్శకులు తాతినేని చలపతిరావు పేరు వినగానే, ఆయన జానపద బాణీలు మన మదిలో ముందుగా చిందులు వేస్తాయి. తప్పెటపై దరువేస్తూ వరుసలు కట్టడంలో మేటి అనిపించుకున్నారు చలపతిరావు. ఆయన స్వరకల్పనలో అనేక మ్యూజికల్ హిట్స్ రూపొంది జనాన్ని విశేషంగా అలరించాయి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ చిత్రాలకూ తనదైన శైలిలో స్వరాలు కూర్చి అక్కడి వారి ఆదరణనూ చూరగొన్నారు చలపతిరావు.
చలపతిరావు 1920 డిసెంబర్ 22న జన్మించారు. ఆయన కన్నవారు ద్రోణవిల్లి రత్తయ్య, మాణిక్యమ్మ. అయితే చిన్నప్పుడే చలపతిరావును తాతినేని కోటేశ్వరరావు, కోటమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. అలా ప్రముఖ దర్శకనిర్మాత తాతినేని ప్రకాశరావుకు చలపతిరావు సోదరుని వరుస అవుతారు. చలపతిరావు చక్కగా చదువుకుంటూనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. ఎలక్ట్రికల్ బి.ఇ., చదివిన తరువాత చిత్రసీమలో తన సంగీతంతో అలరించాలన్న అభిలాష కలిగింది. అదే సమయంలో గరికపాటి రాజారావు ‘పుట్టిల్లు’ నిర్మిస్తూ కొత్తవారిని ప్రోత్సహించారు. ఈ చిత్రం ద్వారానే ప్రముఖ నటి జమున, ప్రమఖ హాస్యనటులు అల్లు రామలింగయ్య పరిచయం అయ్యారు. తరువాత యన్టీఆర్, ఏయన్నార్ నటించిన ‘పరివర్తన’కు సంగీతం అందించారు చలపతిరావు. ఈ సినిమాకు తాతినేని ప్రకాశరావు దర్శకులు. ఈ చిత్రం తరువాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఇల్లరికం’కు స్వరకల్పన చేశారు. ఈ సినిమాలోని పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ఆ తరువాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన అనేక చిత్రాలకు చలపతిరావు సంగీతం భలేగా సందడి చేసింది.
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఏ.వి.సుబ్బారావు, రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన సినిమాలకు చలపతిరావు సంగీతం ఓ దన్నుగా నిలచింది. ఆయన స్వరకల్పనలో రూపొందిన యన్టీఆర్ చిత్రాలు “లక్షాధికారి, కలవారి కోడలు, మంచిమనిషి, రాముని మించిన రాముడు” వంటివి పాటలతో అలరించాయి. వీటిలో ‘మంచిమనిషి’ చిత్ర నిర్మాణంలో చలపతిరావు పాలు పంచుకోవడమూ విశేషం. అలాగే ఆ సినిమాకు సాలూరు రాజేశ్వరరావుతో కలసి సంగీతం సమకూర్చడం మరింత విశేషం. కృష్ణకు హీరోగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన ‘గూఢచారి 116’కు, ‘అఖండుడు’ చిత్రాలకు చలపతిరావు సంగీతమే ప్రాణం పోసింది. కృష్ణంరాజు “పరివర్తన, కమలమ్మ కమతం, అమ్మా-నాన్న, మంచి మనసు” చిత్రాలకు చలపతిరావు స్వరాలే పాటలకు బలం చేకూర్చాయి. శోభన్ బాబు నటించిన “డాక్టర్ బాబు, సిసింద్రీ చిట్టిబాబు” సినిమాలకు కూడా వినసొంపైన పాటలు అందించారు చలపతిరావు.
చలపతిరావు సంగీతానికి, అక్కినేని అభినయానికి భలేగా జోడీ కుదిరింది. ‘ఇల్లరికం’ తరువాత ఏయన్నార్ నటించిన “మా బాబు, భార్యాభర్తలు, పునర్జన్మ, మనుషులు-మమతలు, నవరాత్రి, బంగారు గాజులు, ధర్మదాత, దత్త పుత్రుడు, బ్రహ్మచారి, శ్రీమంతుడు, మంచి రోజులు వచ్చాయి, రైతు కుటుంబం, కన్నకొడుకు, పల్లెటూరి బావ, ఆలుమగలు, శ్రీరామరక్ష, నాయకుడు-వినాయకుడు” చిత్రాలకు చలపతిరావు సంగీతం భలేగా సందడి చేసింది. ఈ చిత్రాల జయాపజయాలు ఎలా ఉన్నా, చలపతిరావు సంగీతం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
“అల్లుడొచ్చాడు, అత్తారిల్లు, అర్ధాంగి, హరిశ్చంద్రుడు, జనం-మనం” చిత్రాలకు కూడా చలపతిరావు మంచి సంగీతం అందించారు. అనేక చిత్రాలలో మరపురాని మధురాన్ని మనకు పంచిన చలపతిరావు 1994 ఫిబ్రవరి 22న కన్నుమూశారు. ఈ నాటికీ చలపతిరావు పాటలకు ఇటు తెలుగునాట, అటు తమిళనాట పరవశించి పోయేవారెందరో ఉన్నారు.