Sylvester Stallone: అసలు ప్రపంచ చిత్రసీమలో ‘కండలవీరులు’ ఎక్కువగా తయారు కావడానికి కారకులు సిల్వెస్టర్ స్టాలోన్. తన కండలు చూపిస్తూ ఎంతోమంది మగువల మనసూ గెలిచారాయన. అలా ఆయనను అభిమానించిన ముద్దుగుమ్మల్లో అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి కూడా ఉన్నారు. మరో కండలవీరుడు ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్ కంటే వయసులో ఓ ఏడాది పెద్దవాడైన సిల్వెస్టర్ తన 76వ యేట కూడా హుషారుగా నటించడానికి సిద్ధమవుతున్నారు. “రాకీ, రాంబో” సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను పోగేసిన సిల్వెస్టర్, ఇప్పుడు యాక్షన్ తో పాటు కామెడీనీ పండించాలని ఆశిస్తున్నారు. గతంలో కూడా సిల్వెస్టర్ కొన్ని చిత్రాల్లో హాస్యం ప్రదర్శించినప్పటికీ, ఆయనకున్న యాక్షన్ హీరో ఇమేజ్ ముందు అవేవీ అంతగా అలరించలేకపోయాయి. కానీ, ఇప్పుడు వయసు మీద పడ్డాక కామెడీతో కబడ్డీ ఆడేస్తా అంటున్నారాయన.
Nani30: విక్రమ్ టైటిల్ తో నాని.. భలే బాగుందే..?
అసలు విషయానికి వస్తే – సిల్వెస్టర్ స్టాలోన్ గత కొన్నేళ్ళుగా తన సొంత సంస్థ ‘బల్బోవా ప్రొడక్షన్స్’పై చిత్రాలను నిర్మిస్తున్నారు. మరోవైపు ఇతరుల చిత్రాల్లోనూ నటిస్తున్నారు. స్టాలోన్ నటించిన తాజా చిత్రం ‘గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ-3’ ఈ యేడాది మే 5న జనం ముందు నిలువనుంది. అలాగే ఆయన నటించిన ‘ద ఫ్యామిలీ స్టాలోన్’ సిరీస్ కూడా పూర్తయింది. ఈ సిరీస్ ప్యారామౌంట్ ప్లస్ లో మే 17 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇవన్నీ పూర్తయ్యాయి కాబట్టి, వెంటనే మరో చిత్రంలో నటించాలని స్టాలోన్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఓ కామెడీ యాక్షన్ స్టోరీ రూపొందించారు. దానికి ‘నెవర్ టూ ఓల్డ్ టు డై’ అనే టైటిల్ నూ పెట్టారు. ఈ చిత్రానికి ఇంకా ఎవరినీ డైరెక్టర్ గా ఎంపిక చేయలేదు. ఇక పోతే ‘ది ఎక్స్ పెండబుల్స్’ మరో భాగాన్నీ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు స్టాలోన్. ఆయన హుషారు చూసి ఏది ఏమైనా ‘రాంబో రాంబోయే’ అంటున్నారు అభిమానులు.