స్వాతంత్ర వీర్ సావర్కర్ 139వ జయంతి సందర్భంగా శనివారం ఆయన బయోపిక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. వినాయక దామోదర్ సావర్కర్ బయోపిక్ లో బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ను చూడగానే అచ్చు సావర్కర్ ను చూసినట్టే ఉందంటూ ఆ మహానాయకుడి అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ నూ నిర్మాతలు ఇవాళ విడుదల చేశారు. ఈ తరం సరిగా అర్థం చేసుకోని నాయకుడు వీర సావర్కర్ అనేది దర్శకుడు మహేశ్ మంజేక్రర్ అభిప్రాయం. అందుకే ఆయనలోని ధీరత్వాన్ని, దేశభక్తిని, హిందుధర్మం పట్ల ఉన్న అచంచల విశ్వాసాన్ని నేటి యువతకు ఈ సినిమా ద్వారా తెలియచెప్పాలని మహేశ్ మంజ్రేకర్ తాపత్రయ పడుతున్నాడు.
ఈ సందర్భంగా రణదీప్ హూడా తన మనసులోని మాటలను చెబుతూ, ”మరుగున పడిన సావర్కర్ జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. గొప్ప వ్యక్తిత్వం కలిగిన సావర్కర్ పాత్రకు న్యాయం చేకూర్చడం కోసం నేను నా వంతు కృషి చేస్తాను. ఈ సినిమా దేశ స్వాతంత్రం కోసం పోరాడిన గుర్తింపు పొందని యోధులకు నివాళి లాంటిది” అని అన్నారు. ఈ సినిమాను ఆనంద్ పండిట్, సందీప్ సింగ్, సామ్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.