రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. రజనీ మాతృభాష మరాఠీ. పెరిగిందేమో కర్ణాటక రాజధాని బెంగళూరులో. అయినా ఆయనకు తెలుగు నటులు యన్టీఆర్ సినిమాలంటే భలే ఇష్టం. యన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్నిబెంగళూరులో పలు మార్లు చూశానని చెబుతారు. అలాగే యన్టీఆర్ పౌరాణికాలంటే ఆయనకు ఎంతో అభిమానం. ఇక హిందీ నటుడు శత్రుఘ్న సిన్హా స్టైల్ కూడా రజనీకాంత్ ను ఎంతగానో ఆకట్టుకుందట. యన్టీఆర్, శత్రుఘ్న సిన్హా స్టైల్స్ ను మిక్స్ చేసి, వాటికి తనకు వచ్చిన కొన్ని ట్రిక్స్ కలిపి ‘రజనీ స్టైల్’ సృష్టించుకున్నారాయన.
రజనీకాంత్ తొలి తెలుగు చిత్రం ‘అంతులేని కథ’. ఈ సినిమాలో ఆయనపై “దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి…” పాటను చిత్రీకరించారు. ఏసుదాస్ నేపథ్యగానం చేసిన ఈ పాట ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉంది. ఈ పాటలో రజనీ నటనను గమనిస్తే, యన్టీఆర్ ను ఎలా అనుకరించిందీ ఇట్టే తెలిసిపోతుంది. మధ్యలో సిగరెట్ ను ఎగరేసుకుంటూ తాగడం అన్నది తన స్టైల్ గా మిక్స్ చేశారు రజనీ.
రజనీ కాంత్ తొలి చిత్రం నుండీ తెలుగువారితో అనుబంధం ఉందనే చెప్పాలి. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా రజనీ తెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో శ్రీవిద్య భర్తగా నటించారు. వారి అమ్మాయిగా జయసుధ కనిపించారు. అంటే తొలి సినిమాలోనే జయసుధకు తండ్రిగా రజనీ నటించారన్న మాట! ఇక రజనీకాంత్ తొలి తెలుగు చిత్రం ‘అంతులేని కథ’. ఇందులో ఆయన జయప్రదకు అన్నగా నటించి మెప్పించారు. ఇలా తమిళ, తెలుగు తొలి చిత్రాల్లో జయసుధ, జయప్రద బంధువుగా నటించిన రజనీ, తరువాతి రోజుల్లోనూ ఆ అనుబంధాన్ని అలాగే కొనసాగించారు.
తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలలో రజనీకాంత్ ఏ అవకాశం చిక్కినా వదలుకొనేవారు కాదు. మురళీమోహన్ హీరోగా రూపొందిన ‘తొలిరేయి గడిచింది’లో చిన్న పాత్ర అయినా పోషించారు. అలాగే మురళీమోహన్ హీరోగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఆమె కథ’లోనూ రజనీకాంత్ ప్రతినాయకునిగా నటించారు. ‘చిలకమ్మ చెప్పింది’లో సంగీతకు జోడీగా నటించారు.
‘అన్నదమ్ముల సవాల్’లో తన కంటే వయసులో పెద్ద అయిన కృష్ణకు అన్నగా నటించారు. ఆ తరువాత కృష్ణతో కలసి ‘ఇద్దరూ అసాధ్యులే, రామ్ రాబర్ట్ రహీమ్’లోనూ రజనీ అభినయించారు. శోభన్ బాబు తమ్మునిగా ‘జీవనపోరాటం’లో కనిపించారు. అప్పటికే రజనీకాంత్ తమిళనాట టాప్ స్టార్. అయినా, తెలుగుపై అభిమానంతో నిర్మాత సుబ్బరామిరెడ్డి అడగ్గానే నటించారాయన.
చిత్రసీమలో రజనీకాంత్, మోహన్ బాబు ఇద్దరూ ఒకే సమయంలో ప్రవేశించారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. రజనీ తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్’లో ఆయన పోషించిన పాత్రను తెలుగు రీమేక్ ‘తూర్పు -పడమర’లో మోహన్ బాబు ధరించారు. అలాగే తమిళంలో రజనీ పోషించిన పాత్రను తెలుగు ‘పదహారేళ్ళ వయసు’లో మోహన్ బాబు అభినయించారు. ఇక ‘అమ్మ ఎవరికైనా అమ్మ’ చిత్రంలో రజనీ హీరోగా, మోహన్ బాబు విలన్ గా నటించారు. ఆ మైత్రీబంధంతోనే ‘పెదరాయుడు’ సినిమా రీమేక్ రైట్స్ మోహన్ బాబుకు ఇప్పించి, ఆ చిత్రంలో పాపారాయుడు పాత్రలో నటించి అలరించారు రజనీకాంత్.
రజనీకాంత్ తొలి హిందీ చిత్రం ‘అంధా కానూన్’. ఆ చిత్ర నిర్మాత ఎ.పూర్ణచంద్రరావు తెలుగువారు. ‘అంధా కానూన్’లోనే రజనీకాంత్ ఉత్తరాదివారిని విశేషంగా ఆకట్టుకున్నారు. దాంతో ఆ తరువాత హిందీలోనూ రజనీ స్టైల్ కు ఓ క్రేజ్ ఏర్పడింది. తనను హిందీ సినిమాకు పరిచయం చేసిన పూర్ణచంద్రరావు పై అభిమానంతో ఆయన నిర్మించిన తెలుగు చిత్రం ‘న్యాయం మీరే చెప్పాలి’లో గెస్ట్ గా కనిపించారు రజనీకాంత్.
ఇక తన అభిమాన నటుడు యన్టీఆర్ తో కలసి రజనీకాంత్ ‘టైగర్’లో నటించారు. 1979లో తెరకెక్కిన ఈ చిత్రానికి నందమూరి రమేశ్ దర్శకుడు. ఇందులో జయసుధ చెల్లెలు సుభాషిణి, రజనీకాంత్ కు జోడీగా నటించారు. ‘టైగర్’ షూటింగ్ సమయంలోనే తాను అన్న యన్టీఆర్ ను ఎంతలా అభిమానించింది పదే పదే ఇంటర్వ్యూలలో చెప్పారు రజనీకాంత్. అప్పట్లో రజనీకాంత్ సమయం దొరికితే చాలు మందు కొట్టేవారట. ఈ విషయం యన్టీఆర్ కు తెలిసి, ‘బ్రదర్…మీకు ఎంతో భవిష్యత్ ఉంది… ఆ మందు అలవాటు మానుకోండి…’ అని సూచించారట. అంతేకాదు, ఆ అలవాటు మానుకోవడానికి యోగ, ప్రాణాయామం ఆశ్రయించమనీ చెప్పారట. అంతకు ముందే యోగాభ్యాసం చేస్తున్నా, యన్టీఆర్ సలహా ఇచ్చిన తరువాత సీరియస్ గా తీసుకొని, దానిని మరింత నిష్టతో అభ్యాసం చేశారు రజనీ. ఆ తరువాత ఆయన ఆధ్యాత్మిక చింతనలో సాగడం ఆరంభించారు. ఆ సాధన తరువాతే రజనీకాంత్ తమిళనాట అనూహ్యంగా సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారు. అయినా, రజనీకాంత్ ఏ నాడూ ఆధ్యాత్మిక చింతనకు దూరం కాలేదు. తరచూ హిమాలయలకు వెళ్ళి, అక్కడ బాబాలను దర్శించుకొని వస్తూ ఉంటారు. అలా వెళ్ళి వచ్చిన ప్రతీసారి రజనీకాంత్ కు ఏదో ఒక మంచి జరిగేదని చెబుతారు.
ఆధ్యాత్మిక భావనతోనే ‘బాబా’ చిత్రాన్ని సొంతగా నిర్మించి, నటించారు అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్లుకోలేక పోయింది. కొనుగోలు దారులు నష్టాల పాలయ్యారు. వారి నష్టాన్ని భర్తీ చేసేందుకు కొంతమొత్తాన్ని తిరిగి ఇచ్చారు రజనీకాంత్. ఈ సంప్రదాయంలోనూ రజనీకాంత్ యన్టీఆర్ నే అనుసరించడం విశేషం. ఎలాగంటే, యన్టీఆర్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ను 1991లో విడుదల చేశారు. ఆ సినిమాపై క్రేజ్ తో భారీ రేట్లకు కొన్నారు. అయితే ఆ చిత్రం జనాదరణ పొందలేక పోయింది. దాంతో కొనుగోలుదారులకు నష్టాలు వాటిల్లాయి. అప్పుడు యన్టీఆర్ నష్టపోయినవారికి పరిహారం చెల్లించారు. అదే పంథాలో రజనీ సైతం సాగడం గమనార్హం.
ఇలా రామారావు అంటే ఎంతగానో అభిమానించే రజనీకాంత్, 1995లో యన్టీఆర్ ను చంద్రబాబు అండ్ కో బర్తరఫ్ చేసినప్పుడు, వారి తరపున మాట్లాడారు. అప్పట్లో రజనీకాంత్ తో ఏపీ అసెంబ్లీ ఆవరణలోని సమావేశమందిరంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో యన్టీఆర్ ను తమిళనాట పెరియార్ గా పేరొందిన రామస్వామి నాయకర్ తో పోల్చారు రజనీకాంత్. తరువాత హైదరాబాద్ నుండి మద్రాసుకు బయలు దేరుతూ ఉండగా, ఎయిర్ పోర్ట్ లో మళ్ళీ విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు, తానెప్పటికీ అన్న యన్టీఆర్ అభిమానినేనని గర్వంగా చెప్పుకున్నారు రజనీకాంత్. ఇప్పటికీ హైదరాబాద్ వచ్చిన ప్రతీసారి యన్టీఆర్ ను స్మరించుకుంటూ ఉంటారు రజనీకాంత్. ‘అన్న లేని లోటు తీర్చలేనిది’ అని అంటూ ఉంటారు.