కమెడియన్ నుండి హీరోగా టర్నింగ్ ఇచ్చుకున్న సునీల్ కు తీరని కోరిక ఏదైనా ఉందంటే వెండితెరపై విలనీ పండించడం! అదీ క్రూరమైన ప్రతినాయకుడి పాత్ర చేయడం!! హీరోగా సునీల్ కొన్ని విజయాలు, కొన్ని పరాజయాలు చవిచూసిన తర్వాత ఏం చేయాలో తెలియక అనిశ్చిత పరిస్థితిలో పడ్డాడు. అప్పుడు మిత్రుడు త్రివిక్రమ్ కౌన్సిలింగ్ చేసి, తిరిగి సునీల్ ను కమెడియన్ గా నిలబెట్టాలని ప్రయత్నించాడు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తి స్థాయిలో కమెడియన్ పాత్రలే కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయమని సలహా ఇచ్చాడు. తన చిత్రాలలోనూ సునీల్ కు ప్రాధాన్యమున్న పాత్రలు ఇచ్చాడు త్రివిక్రమ్. కానీ సునీల్ కోరుకున్న అరివీర భయంకర ప్రతినాయకుడి పాత్ర ఇచ్చే సాహసం త్రివిక్రమ్ చేయలేదు.
Read Also : ‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్… ఇళయరాజా రికార్డును బ్రేక్ చేసిన దేవిశ్రీ
గత కొంతకాలంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను సునీల్ చేస్తూ వచ్చాడు. ‘డిస్కోరాజా, కలర్ ఫోటో, కనబడుట లేదు, పుష్పక విమానం’ వంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు పోషించి, ఫర్వాలేదని పించాడు. అయితే శుక్రవారం రాబోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో మాత్రం మంగళం శ్రీనుగా సునీల్ పోషించిన పాత్ర అతన్ని మరో స్థాయిలో నిలబెడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో హీరో పుష్పరాజ్ మార్గానికి అడ్డుగా నిలిచే పాత్రలు మరో రెండు ఉన్నా… అందులో మంగళం శ్రీను పాత్రే ప్రధానమైనదని, ఆ పాత్రను సునీల్ గొప్పగా పండించాడని చిత్ర బృందం చెబుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే సిండికేట్ కు నాయకుడిగా సునీల్ నటించాడని, అతన్ని పుష్పరాజ్ ఎదుర్కునే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. అదే నిజమైతే మాత్రం తెలుగు సినిమా రంగానికి మరో గొప్ప విలన్ లభించినట్టు భావించొచ్చు!