Sudheer Babu: సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు సుధీర్ బాబు తనదైన శైలిలో టాలీవుడ్ లో సాగిపోతున్నాడు. వైవిధ్యమైన కథాంశాలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళుతున్నాడు. అతని తాజాచిత్రం ‘మామా మశ్చింద్ర’ విడుదలకు సిద్ధంగా ఉండగా, ఈ యేడాది డిసెంబర్ నెలాఖరులో ఇంకో సినిమా విడుదల కానుంది. దీన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి నాయుడు ‘హరోంహర’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. ‘ది రివోల్ట్’ అనేది ట్యాగ్ లైన్. మే 11వ తేదీ సుధీర్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ ట్రిగ్గర్ వీడియోను విడుదలచేశారు.
రేడియోలో వాతావరణ రిపోర్ట్ తో వీడియో ప్రారంభమైంది. కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో ఆయుధాలతో వస్తారు. అతని ముఖం కనిపించనప్పటికీ సుధీర్ బాబు కుర్చీలో కూర్చుని చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తారు. చివరగా అతని తుపాకీ నుండి ఫస్ట్ ట్రిగ్గర్ విడుదలౌతుంది. “అందరూ పవర్ కోసం గన్ పట్టుకుంటారు… కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది… ఇది నాకేమో సెప్తావుంది…” అని సుధీర్ బాబు కుప్పం యాసలో అదరగొట్టాడు. మాండలికం, అతని బేస్ వాయిస్ పాత్రకు ఇంటెన్స్ తెచ్చింది. సుధీర్ బాబు సినిమా కోసం పూర్తిగా మేక్ఓవర్ అయ్యారనిపిస్తోంది. యాక్షన్ తో నిండివున్న ఈ ఫస్ట్ ట్రిగ్గర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ‘హరోం హర’ కథ 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతుందని మేకర్స్ చెబుతున్నారు. దీనికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్నాడు.
చిత్రం ఏమంటే… సుధీర్ బాబు ‘హరోంహర’ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ఐదు భాషల్లో రానుంది. కానీ ఇప్పటికే ఆ సీజన్ లో నాని 30వ సినిమా డిసెంబర్ 21, వెంకటేశ్ ‘సైంథవ్’ 22న విడుదల కాబోతున్నాయని వాటి దర్శక నిర్మాతలు ప్రకటించారు. పైగా వెంకీ ‘సైంథవ్’ కూడా పాన్ ఇండియా మూవీనే. మరీ ఒకే రోజున రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదల అవుతాయా అనేది చూడాలి!