Sriya Reddy:ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ప్రతి ఆర్టిస్ట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఎన్నో ఏళ్ళు ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తుంది. ఇప్పటికే అనిమల్ సినిమా ద్వారా త్రిప్తి దిమ్రి నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక తాజాగా మరో నటి.. అంతటి గుర్తింపును అందుకుంది. ఆమె ఎవరో కాదు.. శ్రేయా రెడ్డి. సలార్ సినిమాతో ఈమె తెలుగుకు రీ ఎంట్రీ ఇచ్చింది. రాధా రమగా సలార్ లో ఆమె నటన నెక్స్ట్ లెవెల్. ఖాన్సార్ ను ఆమె ఏ రేంజ్ లో వణికించిందో సలార్ చూస్తే తెలుస్తోంది. ఇక సలార్ రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి శ్రేయా రెడ్డి పేరు మారుమ్రోగిపోతుంది. ఎవరు ఈమె అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. శ్రేయా రెడ్డి.. కెరీర్ ప్రారంభించిందే తెలుగు సినిమాతో అని ఎంతమందికి తెలుసు. రాజా హీరోగా అప్పుడప్పుడు అనే సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ.. శ్రేయాకు వరుస అవకాశాలను అందించింది. ఇక ఈ భామ.. కెరీర్ టర్నింగ్ పాయింట్ అంటే.. పొగరు అనే చెప్పాలి.
విశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతడిని పిచ్చిగా ప్రేమించే విలన్ పాత్రలో శ్రేయా నటించింది అనడం కన్నా జీవించింది అనే చెప్పాలి. ఈ సినిమా ఆమెకు హిట్ నే కాదు జీవితాన్ని కూడా ఇచ్చింది. ఈ సినిమా సెట్ లో శ్రేయా.. విశాల్ అన్న విక్రమ్ తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. ఇక పెళ్లి తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన శ్రేయా.. ఈ ఏడాది నుంచే రీ ఎంట్రీ ఇచ్చింది. సుడల్ అనే వెబ్ సిరీస్.. ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా.. మళ్లీ శ్రేయాకు టర్నింగ్ పాయింట్ ఇచ్చింది సలార్. పొగరు సినిమాలో అందరూ విమర్శించే పాత్ర నుంచి సలార్ లో ఆమె నటనకు ఫిదా అయ్యే పాత్ర వరకు శ్రేయా ఎదిగిన తీరు అద్భుతమని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క సినిమాతో శ్రేయా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. ముందు ముందు శ్రేయాను ఆపడం ఎవరి తరం కాదు. మరి ఈ భామ తన ఫేమ్ ను ఏ రేంజ్ లో ఉపయోగించుకుంటుందో చూడాలి.