తండ్రి సరసన నాయికగా నటించిన భామతో తనయుడు రొమాన్స్ చేయడం అన్నది నిస్సందేహంగా సదరు హీరోయిన్ కు ఓ క్రెడిట్ అనే చెప్పాలి. తల్లితోనూ, ఆమె కూతురితోనూ నాయకునిగా నటిస్తే అది తప్పకుండా ఆ హీరోకు క్రెడిట్ కాకమానదు. మొదటి విషయానికి వస్తే – తండ్రి, కొడుకు ఇద్దరితోనూ రొమాన్స్ చేసిన నాయికలు ఉన్నారు. ఇప్పుడు లెక్కకు మిక్కిలిగానే కనిపిస్తున్నారు. కానీ,ఆ రోజుల్లో తండ్రి హీరోయిన్ తో తనయుడు రొమాన్స్ చేయడమంటే ఓ విశేషంగా ఉండేది. అందునా శ్రీదేవి లాంటి ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ తో ఆ ఫీట్ చేస్తే నిజంగానే అది మరింత విశేషమే కదా! ఏయన్నార్ సరసన అనేక చిత్రాలలో మురిపించిన శ్రీదేవి, ఆయన తనయుడు నాగార్జునతోనూ జోడీ కట్టి అలరించారు. అలా నాగార్జునతో శ్రీదేవి నటించిన తొలి చిత్రం ‘ఆఖరి పోరాటం’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించిన ‘ఆఖరి పోరాటం’ జనాన్ని అలరించింది. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇళయరాజా బాణీల్లో మరింతగా మురిపించింది. 1988 మార్చి 12న ‘ఆఖరి పోరాటం’ జనం ముందు నిలచి అలరించింది.
‘ఆఖరి పోరాటం’ కథ విషయానికి వస్తే – ఇందులో నాయికదే పైచేయి. సీబీఐ ఆఫీసర్ ప్రవల్లిక చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, అన్యాయాలకు పాల్పడేవారికి సింహస్వప్నంగా ఉంటుంది. అనంతానంత స్వామి మతం, మూఢనమ్మకాల ముసుగుతో జనాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు. దేశానికే అధ్యక్షుడై నిరంకుశ పాలన సాగించాలని ఆ స్వామిజీ యోచన. దీనిని ప్రవల్లిక తెలుసుకుంటుంది. అయితే స్వామిజీ భక్తులు ప్రభుత్వ యంత్రాంగంలోనూ, రాజకీయాల్లోనూ ఉంటారు. వారి ద్వారా స్వామిజీ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని, అల్లకల్లోలాలు సృష్టిస్తూ ఉంటాడు. ఈ పరిశోధనలో ప్రవల్లికకు విహారి పరిచయం అవుతాడు. అతనంటే ప్రవల్లికకు అభిమానం కలుగుతుంది. తరువాత అది ప్రేమగా మారుతుంది. ఎప్పటికప్పుడు తన పజిల్స్ తో ఫోన్ లో క్లూస్ ఇస్తూ కనుక్కోమని చెబుతూ ఉంటుంది. కానీ, విహారి వెతుకులాటలో అతనికి సునాదమాల పరిచయం అవుతుంది. విహారి కన్నవారు సైతం స్వామిజీ భక్తులే! ఆ విధంగానూ స్వామిజీ తన పనులు తాను చేసుకుంటూ పోతుంటాడు. అయితే ప్రవల్లికకు, విహారి సాయం అందిస్తాడు. అతను సైతం స్వామిజీని అనుమానిస్తాడు. చివరకు స్వామిజీ ఆటకట్టించడానికి ప్రవల్లికతో కలసి విహారి రంగంలోకి దిగుతాడు. ఆ పోరాటంలో ప్రవల్లిక ప్రాణాలు కోల్పోతోంది. ఆ స్వామిజీని విహారి అంతమొందించడంతో కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో సుహాసిని, అమ్రిష్ పురి, జగ్గయ్య, సత్యనారాయణ, చంద్రమోహన్, నూతన్ ప్రసాద్, సుత్తివేలు, విజయన్, పి.జె.శర్మ, పేకేటి శివరామ్, ఆనంద్ మోహన్, ప్రదీప్ శక్తి, విమల్ రాజ్, లీ, జయంతి, మమత, నిర్మల, కల్పనారాయ్, అభిలాష, మాస్టర్ రాజేశ్, మాస్టర్ మీస్ రాజ్, మాస్టర్ జయకృష్ణ నటించారు. ఈ చిత్రానికి జంధ్యాల మాటలు రాశారు. ఇళయరాజా బాణీలకు అనువుగా వేటూరి, జొన్నవిత్తుల పాటలు పలికించారు. ఇందులోని “తెల్లచీరకు తకధిమి తపనలు…”, “స్వాతిచినుకు సందెవేళలో…”, “గుండెలో తకిట తకిట…”, “అబ్బ దీని సోకు…”, “ఎప్పుడు ఎప్పుడు…” అంటూ సాగే పాటలు అలరించాయి. ‘తెల్లచీరకు తకధిమ…” పాటను లతామంగేష్కర్, బాలుతో కలసి గానం చేయడం విశేషం! అంతకు ముందు 1955లో ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘సంతానం’ చిత్రంలో తొలిసారి “నిదుర పోరా తమ్ముడా…” తెలుగు పాటను పాడిన లతా మంగేష్కర్, దాదాపు 33 ఏళ్ళ తరువాత అక్కినేని తనయుడు నాగార్జున సినిమాలో తెలుగుపాట పాడడం మరింత విశేషం!
‘ఆఖరి పోరాటం’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత నాగార్జున, శ్రీదేవి జంటగా అశ్వనీదత్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘గోవిందా…గోవిందా…’ నిర్మించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేదు. ‘గోవిందా గోవిందా’కు ముందు హిందీ చిత్రం ‘ఖుదాగవా’లోనూ శ్రీదేవితో, నాగార్జున జోడీ కట్టారు. అలా అక్కినేని నటవంశంలో తండ్రి, తనయుడుతో కలసి నటించి శ్రీదేవి మురిపించారు. ఆమె కంటే ముందు కొందరు హీరోయిన్లు తండ్రితో కలసి నటించిన వారు తనయులతోనూ జోడీకట్టి సందడి చేసిన సందర్భాలున్నాయి. అయితే వారెవరూ శ్రీదేవి స్థాయిలో ఆల్ ఇండియాలో సక్సెస్ సాధించిన వారు కారు. ఏది ఏమైనా ‘ఆఖరి పోరాటం’ చిత్రం శ్రీదేవి, నాగార్జున అభిమానులకు ఓ మరపురాని చిత్రంగా ఈ నాటికీ నిలచే ఉంది.