తెలుగు చిత్రసీమలో శ్రీకృష్ణ పాత్ర అనగానే చప్పున గుర్తుకు వచ్చేది మహానటుడు నందమూరి తారక రామారావే. ఆయన తరువాతే ఎవరైనా అని చెప్పక తప్పదు. యన్టీఆర్ తొలిసారి కృష్ణుని గెటప్ లో కనిపించిన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’. ఇందులో ఓ డ్రీమ్ సాంగ్ లో ఆయన శ్రీకృష్ణునిగా, జమున గోపికగా కనిపించారు. తరువాత ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల నిర్మించిన ‘సొంతవూరు’లోనూ ఓ సన్నివేశంలో కృష్ణునిగా దర్శనమిచ్చారు. ఈ రెండు చిత్రాల తరువాత పౌరాణికగాథగా తెరకెక్కిన ‘మాయాబజార్’లో పూర్తి స్థాయిలో నందమూరి శ్రీకృష్ణునిగా నటించి, ఆనందమూరించారు. ఆ తరువాత నుంచీ పలు పౌరాణిక చిత్రాలలోనూ, కొన్ని జానపదాల్లోనూ, మరికొన్ని సాంఘికాల్లోనూ వెరసి దాదాపు పాతికసార్లు కృష్ణునిగా తెరపై వెలిగారు యన్టీఆర్. ఓ పౌరాణిక పాత్రలో అన్నిసార్లు ఒకే నటుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం అన్నది ప్రపంచంలో ఒక్క రామారావుకే చెల్లింది.
ఇక యన్టీఆర్ నటించిన పురాణగాథల్లో ఆయన వేరే పాత్రలు ధరించినప్పుడు, తప్పకుండా కృష్ణుని పాత్రలో కాంతారావుకు అవకాశం కల్పించేవారు. అలా యన్టీఆర్ పౌరాణికాలు “నర్తనశాల, బభ్రువాహన, పాండవవనవాసము, ప్రమీలార్జునీయం” వంటి చిత్రాలలో కాంతారావు కృష్ణునిగా నటించారు. మరికొన్ని సినిమాల్లోనూ కాంతారావు శ్రీకృష్ణ పాత్రలో సాగారు. యన్టీఆర్ ‘భీష్మ’లో కృష్ణునిగా హరనాథ్ అలరించారు. యన్టీఆర్ చిత్రసీమకు రాకమునుపు శ్రీకృష్ణ పాత్రలో సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, ఈలపాట రఘురామయ్య కూడా మెప్పించారు.
ఏయన్నార్ ‘పెళ్ళినాటి ప్రమాణాలు’, ‘గోవుల గోపన్న’ చిత్రాలలో పాటల్లో కృష్ణుని గెటప్ లో కనిపించారు. రామకృష్ణ ‘యశోదాకృష్ణ’లో పూర్తి స్థాయిలో కృష్ణునిగా నటించారు. కృష్ణ తన ‘అల్లూరి సీతారామరాజు’లో క్లయిమాక్స్ లో కాసేపు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా అలరించారు. శోభన్ బాబు తొలుత బాపు ‘బుద్ధిమంతుడు’లోనూ, ఆ పై ‘కురుక్షేత్రం’లో పూర్తి స్థాయిలోనూ శ్రీకృష్ణునిగా నటించారు. ‘నిండుదంపతులు’ లో ఓ పాటలో చంద్రమోహన్ కృష్ణునిగా కనిపించారు. తరువాతి తరం నటుల్లో బాలకృష్ణ ‘మంగమ్మగారి మనవడు’లో “చందురుడు నిన్నుచూసి…” అంటూ సాగే పాటలోనూ, ఆ పై ‘పట్టాభిషేకం’లో “వేణుగాన లోలునికి…” అని మొదలయ్యే గీతంలోనూ శ్రీకృష్ణునిగా అలరించారు. ‘శ్రీకృష్ణార్జున విజయం’ ‘పాండురంగడు’ చిత్రాలలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణునిగా బాలకృష్ణ మురిపించారు. మహేశ్ బాబు ‘యువరాజు’ చిత్రంలో ఓ పాటలో కాసేపు కృష్ణుని గెటప్ లో కనిపించారు.
రాజేంద్రప్రసాద్ ‘లేడీస్ టైలర్’లోనూ, జూనియర్ యన్టీఆర్ ‘బృందావనం’లోనూ నెత్తిన నెమలి పీక పెట్టుకొని మీసాల కృష్ణులుగా కనిపించారు. వీరి పంథాలో అనేక మంది నటులు మీసాలతోనే చేత పిల్లనగ్రోవి పట్టి, నెత్తిన నెమలి ఈకలు పెట్టి మురిపించారు. ప్రస్తుతం సాంకేతికంగా మన తెలుగు సినిమా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో పౌరాణికాలు మళ్ళీ ఊపందుకోగలవేమో! అందువల్ల మరికొందరు స్టార్ హీరోస్ శ్రీకృష్ణ పాత్రలో తెరపై మెప్పించే అవకాశం ఉందని చెప్పవచ్చు.