హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఫిక్షనల్ బయోపిక్ ‘అల్లూరి’ లో నటిస్తున్నారు. ‘నిజాయితీకి మారు పేరు’ అనేది ఉపశీర్షిక. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పిస్తున్న ఈ మూవీలో శ్రీవిష్ణు నిజాయితీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ‘అల్లూరి’ని సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా శనివారం ప్రకటించింది. సెప్టెంబర్ సెకండ్ వీక్ నుండి దసరా సెలవులు కావడం ఈ చిత్రానికి కలసి వస్తుందని నిర్మాత బెక్కెం వేణు భావిస్తున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శ్రీవిష్ణు చేతిలో ఈటె పట్టుకుని ఫెరోషియస్ గా కనిపించాగా, దాని నుండి రక్తం కారడం ఇంట్రస్టింగ్ గా వుంది. ఇప్పటికే కన్నడ, మలయాళ చిత్రాలలో నటించిన కయ్యదు లోహర్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. తనికెళ్ల భరణి, సుమన్, మధుసూదన రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.