స్పైడర్ మేన్
సీరిస్ లో తాజాచిత్రం స్పైడర్ మేన్ : నో వే హోమ్
విడుదలై అర్ధశతం పూర్తి చేసుకుంది. డిసెంబర్ 16న ఈ సినిమా జనం ముందు నిలచింది. యాభై రోజులు పూర్తవుతున్నా ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉండడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా 1.74 బిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీ లో దాదాపు ఒక వేయి మూడు వందల కోట్ల రూపాయలు. స్పైడర్ మేన్: నో వే హోమ్
చిత్ర నిర్మాణానికి 200 మిలియన్ డాలర్లు ఖర్చయింది. అంటే మన కరెన్సీలో 300 కోట్ల రూపాయలు. అంటే ఈ సినిమా వల్ల కేవలం మూడు నెలల్లోనే 1.3 బిలియన్ డాలర్ల నెట్ ప్రాఫిట్ ను సోనీ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో స్పైడర్ మేన్ ఐడెంటిటీని బహిర్గతం చేయడం, డాక్టర్ స్ట్రేంజ్ సహాయంతో సమస్యలను పరిష్కరించడం అన్న అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని సోనీ సంస్థ చెబుతోంది. ప్యాండమిక్ లో కూడా స్పైడర్ మేన్: నో వే హోమ్
ఈ స్థాయి వసూళ్లు చూస్తుందని కలలో కూడా ఊహించలేదని ట్రేడ్ పండిట్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఈ గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో సోనీ, మార్వెల్ సంస్థలు మరిన్ని స్పైడర్ మేన్ మూవీస్ తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే భారీ చిత్రాలను రూపొందించడంలో మేటి అనిపించుకున్న ఈ సంస్థలు స్పైడర్ మేన్
సీరీస్ కోసం కలసి కట్టుగా ముందుకు సాగాయి. ఇప్పటికి స్పైడర్ మేన్ సీరీస్ లో ఈ రెండు సంస్థలు మూడు చిత్రాలు రూపొందించాయి. రాబోయే సినిమాలతో మరింతగా ఆకట్టుకొనే ప్రయత్నంలో సోనీ, మార్వెల్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి భవిష్యత్ లో స్పైడర్ మేన్
మరెన్ని హంగులు పులుముకుని జనం ముందు నిలుస్తాడో చూడాలి.