(జూలై 27న గాయని చిత్ర పుట్టినరోజు)
మళయాళ కోయిలగా జన్మించినా, తెలుగు పాటలో సైతం అమృతం కురిపిస్తూ సాగుతున్నారు గాయని కె.ఎస్.చిత్ర. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించారు చిత్ర. ఆమె గళం తొలుత అనువాద చిత్రాలలోనే తెలుగువారికి పరిచయమైనా, అనతికాలంలోనే అందరి మన్ననలు అందుకొన్నారు. ఇళయరాజా స్వరకల్పనలో విడుదలైన అనువాద చిత్రం ‘సింధుభైరవి’లో “పాడలేను పల్లవైనా…” అంటూ చిత్ర గాత్రం తెలుగువారి వీనులకు సోకి, ఆనందం పంచింది. ఆ తరువాత నుంచీ పలు తెలుగు చిత్రాల్లో చిత్ర గానం వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఇళయరాజా బాణీల్లో చిత్ర పాట మరింత మధురాన్ని పంచేది. అంతకు ముందే తెలుగునేలపై ఇళయరాజాకు విశేషాదరణ లభిస్తూ ఉండేది. ఇక చిత్ర పాటతో దోస్తీ చేసిన ఇళయరాజా బాణీలు మరింతగా జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆరు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా నిలచి చరిత్ర సృష్టించారు.
మాతృభాష మళయాళంతో పాటు, పొరుగునే ఉన్న తమిళంలోనూ మధురామృతం పంచిన తరువాత తెలుగు తేనెల రుచి చూశారు చిత్ర. అంతకు ముందు చిత్ర పలు తెలుగు సినిమాల్లో పాటలు పాడినా, ‘ఆఖరి పోరాటం’లో ఇళయరాజా బాణీలకు అనువుగా వేటూరి పదాలకు తన గాత్రంతో తేనెలద్దుతూ జనాన్ని కట్టిపడేశారు. ఆ తరువాత నుంచీ చిత్ర పాటకోసం తెలుగువారు చెవులు ఇంతలు చేసుకొని ఎదురు చూడసాగారు. ప్రతీసారి శ్రోతలకు పరమానందం పంచుతూ తెలుగు పాటలోనూ తనదైన బాణీ పలికించారు చిత్ర. ‘సీతారామయ్యగారి మనవరాలు’లో “కలికి చిలకల కొలికి మాకు మేనత్త… కలవారి కోడలు కనకమాలక్ష్మి…” పాటలో “కలవారి కోడలు…” అంటూ ఆమె సంగతులు పలికిన తీరు సంగీతప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘రాజేశ్వరీ కళ్యాణం’లో “ఎందరో మహానుభావులు…” త్యాగరాజ కీర్తనతోనూ మురిపించారు. “ఆకాశాన సూర్యుడుండడు సందెవేళకే…” అంటూ ‘సుందరకాండ’లో చిత్ర గళవిన్యాసాలు మరింతగా ఆనందం పంచాయి. “వేణువై వచ్చాను భువనానికి… గాలినై పోతాను గగనానికి…” అని చిత్ర గానం చేసిన ‘మాతృదేవోభవ’ సినిమాను ఆ పాట కోసమే చూసిన వారూ ఉన్నారు. ‘మావిచిగురు’లో “మాట ఇవ్వమ్మా చెల్లీ…” అంటూ వేదన నిండిన స్వరంతో చిత్ర పాడిన తీరు కూడా జనాల హృదయాలను ఆర్ర్దంతో నింపింది. ‘వర్షం’లో “నువ్వొస్తానంటే నేనొద్దంటానా…” అని మురిపించిన వైనాన్ని ఎవరు మాత్రం మరచిపోగలరు? మొత్తం పదిసార్లు ఉత్తమగాయనిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు చిత్ర.
మళయాళ, తెలుగు, తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, హిందీ పాటలతోనూ ఉత్తమగాయనిగా చిత్రకు పట్టాభిషేకం జరిగింది. ఆమె కీర్తి కిరీటంలో అనేక అవార్డులూ రివార్డులు మేలిమి రత్నాల్లా వెలుగొందుతున్నాయి. ‘పద్మశ్రీ,, పద్మభూషణ్’ పురస్కారాలు ఆమెను వరించాయి. ఇక లెక్కలేనన్ని బిరుదులు ఆమె పేరు ముందు చేరి తమ ఉనికిని చాటుకున్నాయి. ఇంతలా అలరిస్తున్న చిత్ర సమాజసేవలోనూ పాలుపంచుకుంటూ ఉంటారు. ఆమె మరిన్ని వసంతాలు చూస్తూ తన కోకిల స్వరంతో జనాన్ని పులకింప చేస్తూనే ఉంటారని ఆశిద్దాం.