పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కళాకారుల కుటుంబంలో జన్మించిన అనిరుధ్ రవిచందర్ బాల్యంలోనే బాణీలు కట్టి భళా అనిపించాడు. అనిరుధ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలి చిత్రం ‘3’లో “వై దిస్ కొలవరి ఢీ…” అంటూ అనిరుధ్ స్వరపరచిన పాట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఆ తరువాత అనేక చిత్రాలలో యువతను విశేషంగా అలరించే స్వరకల్పన చేశాడు అనిరుధ్.
అనిరుధ్ రవిచందర్ 1990 అక్టోబర్ 16న జన్మించాడు. ఆయన తండ్రి రవి రాఘవేంద్ర తమిళ నటుడు. తల్లి లక్ష్మి ప్రముఖ సంప్రదాయనర్తకి. అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర, రజనీకాంత్ భార్య లతకు స్వయానా సోదరుడు. అందువల్లే పలు రజనీకాంత్ చిత్రాలలో రవి కనిపిస్తూ ఉంటారు. చదువుకొనే రోజుల్లోనే అనిరుధ్ లయబద్ధంగా బాణీలు కట్టి చుట్టూ ఉన్నవారిని అలరించేవాడు. పదేళ్ల ప్రాయంలోనే అనిరుధ్ పాపులర్ సినిమా పాటలకు తనదైన రీతిలో స్వరాలు కూర్చి వినిపించేవాడు. అతనిలోని ప్రతిభను గమనించి, రజనీకాంత్ కూడా ఎంతగానో మెచ్చుకొనేవారు. అనిరుధ్ కాలేజీలో చదువుతూ ఉండగానే ఐశ్వర్యా ధనుష్ తమ ‘3’ చిత్రానికి సంగీతం సమకూర్చమని కోరారు. ‘3’ సినిమాలో “వై దిస్ కొలవరి… కొలవరి…ఢీ…” పాటతో యువతను విశేషంగా మురిపించాడు అనిరుధ్.
తమిళంలో అనిరుధ్ స్వరాలతో రూపొందిన అనేక చిత్రాలు తెలుగులో అనువాదమై అలరించాయి. వాటిలోనూ అనిరుధ్ బాణీలు తెలుగువారినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. “త్రీ, డేవిడ్, రఘువరన్ బీ.టెక్, నేను రౌడీనే, ఆవేశం, గ్యాంగ్, కో కో కోకిల, దర్బార్, మాస్టర్” వంటి చిత్రాలకు అనిరుధ్ బాణీలు తెలుగులోనూ మురిపించాయి. ఇక నేరుగా కొన్ని తెలుగు చిత్రాలకూ అనిరుధ్ స్వరకల్పన చేసినవి ఉన్నాయి. వాటిలో “అజ్ఞాతవాసి, జెర్సీ, గ్యాంగ్ లీడర్” చెప్పుకోదగ్గవి. కేవలం 30 ఏళ్ళ ప్రాయంలోనే అనిరుధ్ తన స్వరాలతో జైత్రయాత్ర చేస్తున్నాడు. అనిరుధ్ మునుముందు మరింతగా జనాన్ని ఆకట్టుకుంటాడని ఆశిద్దాం.