D. Madhusudhana Rao Jayanthi: అలరించిన ‘అన్నపూర్ణ’ అధినేత దుక్కిపాటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
D. Madhusudhana Rao Jayanthi:తెలుగు చిత్రసీమలో మరపురాని చిత్రాలను రూపొందించిన అరుదైన సంస్థల్లో ‘అన్నపూర్ణ పిక్చర్స్’ స్థానం ప్రత్యేకమైనది. తొలి చిత్రం ‘దొంగరాముడు’ మొదలు చివరి సినిమా ‘అమెరికా అబ్బాయి’ వరకు విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారు ఆ సంస్థ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు. ఆయన దూరదృష్టి కారణంగానే, అక్కినేని నాగేశ్వరరావు మహానటుడు అనిపించుకోగలిగారు. దుక్కిపాటి తమ ‘అన్నపూర్ణ’ పతాకంపై జనం మెచ్చే చిత్రాలు తెరకెక్కించి పదికాలాల పాటు జనం మదిలో నిలచిపోయారు. ‘తన ప్రతి విజయం వెనుక ఉన్నది దుక్కిపాటి వారి మేధాశక్తి’ అని అక్కినేని పలుమార్లు చెప్పుకున్నారు. దుక్కిపాటి నెలకొల్పిన ‘ఎక్సెల్సియర్ నాటక సమితి’లోనే తొలుత అక్కినేని వేషాలు వేశారు. ఆయన ప్రోత్సాహంతోనే చిత్రసీమలో అడుగు పెట్టారు. ఘంటసాల బలరామయ్యను ఆకట్టుకోగలిగారు. తరువాత తెలుగు చిత్రసీమలో మేటి హీరోగా వెలిగిపోయారు.
అక్కినేనిని, అన్నపూర్ణ సంస్థను చిత్రపరిశ్రమకు అందించిన ఘనత దుక్కిపాటి వారిదే. 1917 జూలై 27న దుక్కిపాటి కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా పెయ్యేరు గ్రామంలో జన్మించారు. దుక్కిపాటి ఆ రోజుల్లోనే బి.ఏ., చదివారు. ఆయనకు సాహిత్యమంటే ఎంతో అభిమానం. అన్ని భాషల సాహిత్యాన్ని చక్కగా చదివేవారు. బెంగాలీ కథలంటే ఆయనకు ఎంతో ఆసక్తి. వాటిని తెలుగులో సినిమాలుగా రూపొందించాలని తపించేవారు. తనకు నచ్చిన కథలను, జనం మెచ్చేలా ఎలా మలచాలో యోచించేవారు.ఏయన్నార్ హీరోగా విజయాలు సాధిస్తున్నా, ఆయనను వైవిధ్యమైన పాత్రలు పలకరించడం లేదని భావించారు దుక్కిపాటి మధుసూదనరావు. తన హీరో వరైటీ రోల్స్ చేయాలంటే, ముందుగా సొంత సంస్థ ఒకటి ఉండి తీరాలని దృఢంగా నిశ్చయించారు. దుక్కిపాటికి కన్నతల్లి లేకపోయినా, సవతితల్లి అన్నపూర్ణమ్మ ఎంతో బాగా చూసుకున్నారు.
Also Read
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. 'ఎన్టీఆర్' 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
ఆ తల్లి పేర 1953లో దుక్కిపాటి మధుసూదనరావు ‘అన్నపూర్ణ పిక్చర్స్’ సంస్థను నెలకొల్పారు. దానికి అక్కినేని నాగేశ్వరరావును ఛైర్మన్ గా చేశారు. తాను మేనేజింగ్ డైరెక్టర్ గా అన్ని వ్యవహారాలు చూసుకొనేవారు. తొలి ప్రయత్నంగా కేవీ రెడ్డి దర్శకత్వంలో దుక్కిపాటి నిర్మించిన చిత్రం ‘దొంగరాముడు’. ఈ చిత్రానికి కేవీ రెడ్డి, డి.వి.నరసరాజు, దుక్కిపాటి మధుసూదనరావు కలసి కథను తయారు చేసుకున్నారు. డి.వి.నరసరాజు మాటలు రాయగా, సముద్రాల పాటలు పలికించారు. ఏయన్నార్, సావిత్రి జంటగా రూపొందిన ‘దొంగరాముడు’ 1955 అక్టోబర్ 1న విడుదలయింది. ఆ మరుసటి రోజునే అంటే అక్టోబర్ 2నే గాంధీ జయంతి. దీనిని దృష్టిలో ఉంచుకొనే, ఇందులో గాంధీజీపై సాగే, “భలే తాత మన బాపూజీ…” అనే పాటను చొప్పించారు. దీనిని బట్టే, కేవీ రెడ్డి, దుక్కిపాటి ఎంత పకడ్బందీగా చిత్రాన్ని తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. ‘దొంగరాముడు’ చిత్రం ఘనవిజయం సాధించింది.
‘దొంగరాముడు’ విజయం సాధించగానే, తరువాతి చిత్రానికి శరత్ బాబు నవల అయితే బాగుంటుందనీ భావించారు దుక్కిపాటి. శరత్ రాసిన ‘నిష్కృతి’ అనే నవల ఆధారంగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘తోడికోడళ్ళు’ తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొంది, మంచి విజయాన్ని మూటకట్టుకుంది.
‘తోడికోడళ్ళు’ విజయం తరువాత ఏయన్నార్, సావిత్రి జంటగా “మాంగల్య బలం, వెలుగునీడలు” వంటి విజయాలు చూశారు దుక్కిపాటి. ఏయన్నార్ ను ద్విపాత్రాభినయంలో చూడాలని దుక్కిపాటి ఆశించారు. అందుకోసం బెంగాలీ చిత్రం ‘తాషేర్ ఘర్’ను ఎంచుకున్నారు. దాని ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘ఇద్దరు మిత్రులు’. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఎంతసేపూ పరభాషా కథలతో చిత్రాలు తీయడమేనా? మన తెలుగు కథలు సినిమాలకు పనికిరావా? అన్న ఆలోచన కలిగింది దుక్కిపాటికి. దాంతో డాక్టర్ శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవలను ‘చదువుకున్న అమ్మాయిలు’ పేరుతో తెరకెక్కించారు. ఆ సినిమా మునుపటి చిత్రాల స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ‘అన్నపూర్ణ’ సంస్థ చిత్రాల స్థాయిలో పాటలతో అలరించింది. ఆరికెపూడి కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘చక్రభ్రమణం’ నవలను ‘డాక్టర్ చక్రవర్తి’ పేరుతో సినిమాగా మలిచారు దుక్కిపాటి. ఈ సినిమా విజయం సాధించింది. ‘తోడికోడళ్ళు’ మొదలు ‘డాక్టర్ చక్రవర్తి’ దాకా అన్ని చిత్రాలకూ ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. ఆదుర్తి వద్ద అసోసియేట్ గా పనిచేసిన కె.విశ్వనాథ్ ను తమ ‘ఆత్మగౌరవం’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేశారు దుక్కిపాటి. ఈ సినిమా దర్శకునిగా విశ్వనాథ్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది.
ముళ్ళపూడి వెంకటరమణ ‘బియాండ్ దిస్ ప్లేస్’ నవల ఆధారంగా ‘పూలరంగడు’ అనే కథను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ నవలారచయిత్రి రంగనాయకమ్మ మాటలు రాశారు. ‘పూలరంగడు’ ఊహించినట్టుగానే మంచి విజయం సాధించింది. సారథీ స్టూడియోస్ భాగస్వామ్యంలో యద్దనపూడి సులోచనారాణి నవల ‘ఆత్మీయులు’ను తెరకెక్కించారు. వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా మ్యూజికల్ హిట్ అనిపించుకుంది. దుక్కిపాటి తరువాత నిర్మించిన “జైవాన్, అమాయకురాలు” చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. మళ్ళీ తమకు అచ్చి వచ్చిన ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘విజేత’ నవలను ‘విచిత్రబంధం’గా నిర్మించి, ఘనవిజయం సాధించారు. ఈ సినిమా ద్వారా రామకృష్ణను గాయకునిగా పరిచయంచేశారు. ‘విజేత’ తరువాత మరో యద్దనపూడి నవల ‘బంగారు కలలు’ను అదే పేరుతో నిర్మించారు. దీనికి కూడా ఆదుర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘విచిత్రబంధం’ స్థాయిలో అలరించలేకపోయింది. ఇదే అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలో ఏయన్నార్ హీరోగా రూపొందిన చివరి చిత్రం.
దుక్కిపాటి ఆ తరువాత కూడా యద్దనపూడి నవలలు ‘ప్రేమలేఖలు, రాధాకృష్ణ’ను అవే పేర్లతో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించారు. బాపు, రమణ కాంబోలో ‘పెళ్ళీడు పిల్లలు’ తెరకెక్కించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘అమెరికా అబ్బాయి’ నిర్మించారు. ఇవేవీ ఒకప్పటి అన్నపూర్ణ పిక్చర్స్ చిత్రాల స్థాయిని అందుకోలేదు. కానీ, నిర్మాతగా దుక్కిపాటికి సంతృప్తి కలిగించాయి. తెలుగు చిత్రసీమలో నవలల ఆధారంగా ఎక్కువ చిత్రాలు నిర్మించిన నిర్మాతగా దుక్కిపాటి నిలచిపోయారు. 1993లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుక్కిపాటిని రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. 2006 మార్చి 26న ఆయన కన్నుమూశారు. ఆయన చిత్రాలు మాత్రం నవతరం ప్రేక్షకులను సైతం అలరిస్తూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
-
Samsung Galaxy Z Fold 8: 50MP కెమెరా, 4800mAh బ్యాటరీతో.. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 విడుదల
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!