నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆయన చేసేది విలన్ క్యారెక్టర్స్ అయినా మనసు మాత్రం ఎంతో మంచిది. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో సోనూసూద్ ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఎందరికో సహాయం అందించి మన్ననలు అందుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలాంటి సాయం అడిగినా అడుగు ముందుకేసి చేసేస్తుంటాడు. తాజాగా సోనూసూద్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు.
జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక అత్యాచార ఘటనను న్యూస్‌లో చూసి షాకయ్యానని సోనూసూద్ తెలిపాడు. ఇది చాలా పెద్ద క్రైం అని.. చేసింది మైనర్ ఆ.. మేజర్ ఆ.. అని కాదని.. ఎలాంటి క్రైం చేశారు అనేది మాత్రమే చూడాలని అభిప్రాయపడ్డాడు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఇలాంటి క్రైంలకు పబ్స్ కారణం అవుతున్నాయి అనేది తప్పు అని.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మైనర్ అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని సోనూసూద్ అన్నాడు. ఏదైనా మనం ఆలోచించే పద్ధతిలో ఉంటుందన్నాడు. ఆడవాళ్లు పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారని విమర్శిస్తారు కానీ.. మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలే వస్తాయని సోనూసూద్ స్పష్టం చేశాడు.