కొంతకాలం నుంచి భారత చిత్రసీమలో సౌత్ vs నార్త్ పోరు జరుగుతోన్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే స్టార్స్‌కి ఆ విషయమై తరచు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నటుడు సోనూసూద్‌కి కూడా సౌత్ vs నార్త్ అంశంపై ప్రశ్నలు ఎదురవ్వగా, తాజాగా అతడు స్పందించాడు. ‘‘హిందీ చిత్రాల్ని కాదనుకొని, దక్షిణాది సినిమాల్ని అంగీకరించడంపై నాకు తరచూ ప్రశ్నలు ఎదురయ్యేవి. అయితే.. నేను ఏం చేస్తున్నానన్న విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఏ భాషలో సినిమాలు చేసినా, స్క్రిప్టును బట్టి జాగ్రత్తగా ఎంచుకుంటాను. నాకు నచ్చని హిందీ సినిమాలను చేయకుండా, దక్షిణాది పరిశ్రమే నన్ను రక్షించింది’’ అని సోనూసూద్ చెప్పుకొచ్చాడు.
ఒకానొక సమయంలో పెద్ద సినిమాల్లో కనిపించడం కోసమే సినిమాలు చేస్తున్నామన్న దశ వచ్చిందని.. అలాంటి పరిస్థితి నుంచి దక్షిణాది సినిమాలే తనని బయటపడేశాయని సోనూసూద్ వెల్లడించాడు. ఈ రంగంలో ఉన్నప్పుడు ప్రజలకు వినోదం పంచాలని, తానొక విజయవంతమైన నటుడినని ప్రేక్షకుల్ని తేలికగా తీసుకుంటే పప్పులో కాలేసినట్టేనని అతడు పేర్కొన్నాడు. కరోనా మహమ్మారి తర్వాత తనకు అన్నీ పాజిటివ్ పాత్రలే వస్తున్నాయని చెప్పిన సోనూసూద్.. తనని నెగెటివ్ పాత్రల్లో చూపించేందుకు నిర్మాతలు వెనుకాడినట్లున్నారని చెప్పాడు. ఇది తన జీవితంలో మరో దశ అని, తనకొక కొత్త ఇన్నింగ్స్ అని సోనూసూద్ చెప్పుకొచ్చాడు.
కాగా.. కరోనా కాలంలో సోనూసూద్ రియల్ హీరోగా అవతరించిన విషయం తెలిసిందే! ఎందరో పేదల్ని ఆదుకోవడంతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఫలితంగా, అతడ్ని రియల్ హీరోగా కొలవడం ప్రారంభించారు. అందుకే, ఈమధ్య చాలావరకు పాజిటివ్ పాత్రలే అతనికి దక్కుతున్నాయి. ప్రస్తుతం బోలెడన్ని సినిమాలతో బిజీగా ఉన్న సోనూసూద్.. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన పృథ్వీరాజ్‌లో చాంద్ బర్దాయ్ పాత్రలో కనిపించనున్నాడు.