నటరత్న యన్.టి.రామారావుకు తన సహనటీనటులు అంటే ఎంతో గౌరవాభిమానాలు ఉండేవి. నిజానికి యన్టీఆర్ తొలి కథానాయిక అంజలీదేవి. వారిద్దరూ నటించిన ‘పల్లెటూరి పిల్ల’ ముందు ఆరంభమైనా, యన్టీఆర్ హీరోగా విడుదలయిన తొలి చిత్రంగా ‘షావుకారు’ నిలచింది. అందువల్ల ఆ సినిమా నాయిక జానకి ఆయన తొలి కథానాయిక అయ్యారు. యన్టీఆర్ సొంత చిత్రాలలో తొలి ఘనవిజయంగా నిలచిన ‘జయసింహ’లోనూ అంజలీదేవి నాయిక. ఆ విధంగా ఆమె అంటే ఆయనకు ఎంతో గౌరవం. అయితే అంజలీదేవి సొంత సంస్థ అంజలీ పిక్చర్స్ లో యన్టీఆర్ నటించిన ఏకైక చిత్రం ‘స్వర్ణమంజరి’. ఈ జానపద చిత్రం 1962 ఆగస్టు 10న విడుదలయింది.
‘స్వర్ణమంజరి’ కథ ఏమిటంటే – యువరాజు చంద్రభాను పుట్టిన రోజున స్వర్ణమంజరి తన తండ్రి వర్మ నేతృత్వంలో ఆటపాటలతో మెప్పిస్తుంది. ఆమె అందం చూసి చంద్రభాను ఆకర్షితుడవుతాడు. ఆ దేశానికి మంత్రి అయిన మహేంద్ర శక్తి కూడా ఆమెను చూసి మోహిస్తాడు. పైకి రాజగురువుగా కనిపించే మహేంద్ర శక్తి, ఓ మాంత్రికుడు. స్వర్ణమంజరిని దేవతకు బలి ఇచ్చి, ప్రపంచాన్ని ఏలే శక్తి సంపాదించాలని యోచిస్తాడు. చంద్రభాను తన మిత్రుడు శ్రీముఖతో కలసి దేశ పర్యటన చేస్తుంటాడు. అదే సమయంలో స్వర్ణమంజరి తండ్రి వర్మ అభిలాష తెలుసుకుంటాడు చంద్రభాను. ఆమెను తన రాణిగా చేసుకోవాలని భావిస్తాడు చంద్రభాను. ఈ లోగా ఓ జలకన్య, చంద్రభాను అందానికి ఆకర్షితురాలై తన జలలోకంలోకి అతడిని తీసుకు వెళ్తుంది. చంద్రభానును స్వర్ణమంజరి రక్షించే ప్రయత్నంలో జలకన్య ఆమె చేతులు పోగొడుతుంది. చంద్రభాను, స్వర్ణమంజరిని పెళ్ళాడతాడు వారికి ఓ బాబు పుడతాడు. చంద్రభానును జలకన్య మళ్ళీ పట్టుకు పోతుంది. స్వర్ణమంజరికి కష్టాలు మొదలవుతాయి. ఆమె కొడుకును పోగొట్టుకుంటుంది. స్వర్ణమంజరికి ఓ నాగదేవత సాయం చేస్తాడు. ఆమెకు చేతులు వస్తాయి. మంజరికి ఓ మణిని ఇస్తాడు. రాజగురు ద్రోహబుద్ధి తెలుసుకున్న చంద్రభాను అతనితో తలపడతాడు. స్వర్ణమంజరి మణిప్రభావంతో భర్తను రక్షించుకుంటుంది. ఆ మణికోసం స్వర్ణమంజరి కొడుకును చంపాలనుకుంటాడు రాజగురు. స్వర్ణమంజరి తండ్రి వద్ద ఉండే ఏనుగు రాజగురును చంపేస్తుంది. దాంతో కథ సుఖాంతమవుతుంది.
యన్టీఆర్, అంజలీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో చిత్తూరు వి.నాగయ్య, రాజనాల, పద్మనాభం, మీనాకుమారి, కన్నాంబ, రామకృష్ణ, పేకేటి శివరామ్, అల్లు రామలింగయ్య, జయంతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. ఈ చిత్ర నిర్మాత పి.ఆదినారాయణ రావు సంగీతం సమకూర్చారు. సీనియర్ సముద్రాల పాటలు పలికించారు. ఇందులోని “మధురమైన గురుదీవెన…” పాట అన్నిటి కంటే ఆదరణ చూరగొంది. “రావే ప్రణవ రూపిణి…”, “మైమరిపించే ఈ సొగసు…”, “తరలి రావా మహాదేవా…”, “ఆడెను పాడెనుగా…” , “చూతము రారే…”, “ఇదియే జీవితానందమూ…”, “ఏమో ఏమో యెదలోన…”, “అమ్మానీ ఆశలన్నీ…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి.
యన్టీఆర్, అంజలీదేవి జంటగా రూపొందిన జానపద చిత్రాలు “జయసింహ, భట్టి విక్రమార్క, రాజనందిని, బాలనాగమ్మ” వంటివి మంచి విజయం సాధించాయి. ‘రాజనందిని’, ‘బాలనాగమ్మ’ చిత్రాలకు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. పైగా అంజలీ పిక్చర్స్ లో వేదాంతం రాఘవయ్య అంతకు ముందే ‘అనార్కలి, సువర్ణసుందరి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘సువర్ణసుందరి’ 1957 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచింది. అందులో ఏయన్నార్ కథానాయకుడు. యన్టీఆర్ తోనూ ఓ జానపదం తీయాలనే ఉద్దేశంతోనే ఈ ‘స్వర్ణమంజరి’ని తెరకెక్కించారు. అయితే యన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ కు ఈ సినిమాలోని కథ బలహీనం కావడం, ఆయన పాత్ర సైతం అంతగా పండక పోవడంతో ‘స్వర్ణమంజరి’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. రిపీట్ రన్స్ లో మాత్రం ‘స్వర్ణమంజరి’ మంచి ఆదరణ పొందింది.