ఎల్.ఆర్.ఈశ్వరి – ఈ పేరు ఆ రోజుల్లో ఎంతోమందికి ఉరకలు వేసే ఉత్సాహాన్ని నింపేది. ఎల్.ఆర్.ఈశ్వరి గళంలో జాలువారిన అనేక పాటలు తెలుగువారికి గిలిగింతలు పెట్టాయి. ఆమె పాడిన ఐటమ్ సాంగ్స్ అయితే జనాన్ని సీట్లలో కుదురుగా కూర్చోనీయలేదు. ‘ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్’ గా అప్పట్లో ఎల్.ఆర్.ఈశ్వరి గాత్రం జనంపై మత్తు చల్లి గమ్మత్తు చేసింది. ఈ నాటికీ ఆ నాటి ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు విని పులకించిపోయేవారు ఎందరో ఉన్నారు.
ఎల్.ఆర్.ఈశ్వరి పూర్తి పేరు లూర్దు మేరీ రాజేశ్వరి. 1939 డిసెంబర్ 8న ఎల్.ఆర్.ఈశ్వరి జన్మించారు. ఆమె తల్లి కూడా పాటలు పాడేవారు. తమిళ చిత్రాలలో గ్రూప్ సింగర్ గా ఆమె జీవనం సాగించేవారు. తరువాతి రోజుల్లో ఎల్.ఆర్.ఈశ్వరి సైతం కోరస్ సింగర్ గా చిత్రసీమలో ప్రవేశించారు. ఆమెలోని గాయనిని ముందుగా గుర్తించిన వారు ప్రముఖ నిర్మాత, సంగీత దర్శకులు పి.ఆదినారాయణ రావు. తాను స్వరకల్పన చేసిన ‘సువర్ణసుందరి’లో “పిలువకురా… అలుగకురా…” పాటలో ఆమెతో కోరస్ పాడించారు. తరువాతి రోజుల్లో ఎమ్.ఎస్.విశ్వనాథన్, కేవీ మహదేవన్, టి.వి.రాజు, సత్యం, చక్రవర్తి వంటివారు ఎల్.ఆర్.ఈశ్వరికి విరివిగా అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ అనగానే అందరు సంగీత దర్శకులు ఎల్.ఆర్.ఈశ్వరి పేరునే పలవరించేవారు. అందుకు తగ్గట్టుగానే ఈశ్వరి తన గాత్రంతో మాయ చేసి మురిపించేవారు. ఆ నాటి మేటి ఐటమ్ గాళ్స్ అందరికీ ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు పాడి పరవశింప చేశారు. అయితే జ్యోతిలక్ష్మి ఆటకు, ఎల్.ఆర్.ఈశ్వరి పాటకు జోడీ కుదిరి ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
జానపద చిత్రాల్లోనూ ఎల్.ఆర్.ఈశ్వరి గానం చిత్రవిచిత్రాలు చేసింది. ముఖ్యంగా జానపద బ్రహ్మ బి.విఠలాచార్య రూపొందించిన అనేక చిత్రాలలో ఎల్.ఆర్.ఈశ్వరి పాట భలేగా మురిపించింది. చిత్రమేమంటే, యన్టీఆర్ తో విఠలాచార్య తెరకెక్కించిన ‘పిడుగు రాముడు’లో ఓ సన్నివేశంలో యన్టీఆర్ ఆడవేషం వేషం వేస్తారు. ఆ సందర్భంలో చోటు చేసుకున్న “రంగులు రంగులు…” పాటలో యన్టీఆర్ కు ఎల్.ఆర్.ఈశ్వరి గానం చేయడం విశేషం! తొలుత కీ రోల్స్ లో నటిస్తూ రాణించిన వాణిశ్రీ, కాంచన, వెన్నిరాడై నిర్మల వంటివారికి సైతం ఎల్.ఆర్.ఈశ్వరి గాత్రమే ఆదరువుగా నిలచింది. ఐటమ్ గాల్స్ కే పాటలు పాడే ఎల్.ఆర్.ఈశ్వరిని కొందరు గాయనీమణులు చిన్నచూపు చూసేవారు. ఐటమ్స్ పాడే అమ్మాయికి సంగీతం ఏమి తెలుసు, విలువలు ఏమి తెలుసు అంటూ ఎద్దేవా చేసేవారు. అయితే అదే గాయనీమణులు తరువాతి రోజుల్లో ఎల్.ఆర్.ఈశ్వరి బాటలోనే పయనిస్తూ ఈమెకు ఛాన్స్ ఇవ్వకుండా ఐటమ్ సాంగ్స్ పాడారు. అదీ ఆమె బాణీలోనే పాడి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. అదే తాను సాధించిన విజయం అంటూ ఎల్.ఆర్.ఈశ్వరి గొప్పగా చెప్పుకొనేవారు. కొన్ని చిత్రాలలో హీరోయిన్స్ కు సైతం ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు పాడి అలరించారు. కొంతమంది కేరెక్టర్ యాక్టర్స్ కు భక్తిగీతాలూ ఆలపించారు. నిజజీవితంలోనూ ఎల్.ఆర్.ఈశ్వరి పలు భక్తి పాటలు పాడి ఆకట్టుకున్నారు.
ఈశ్వరి అమ్మ అంటూ సంగీతకళాకారులు అభిమానంగా పిలుచుకొనే ఎల్.ఆర్.ఈశ్వరి అభిమానుల అభిలాష మేరకు కొన్ని చిత్రాలలో ఎల్.ఆర్. ఈశ్వరిగానే కనిపించారు. తెలుగులో మంచి విజయం సాధించిన ‘కిక్’ ఆధారంగా తమిళంలో రూపొందిన ‘తిల్లాలంగడి’ చిత్రంలో ఓ సీన్ లో ఎల్.ఆర్.ఈశ్వరి కనిపించి ఆకట్టుకున్నారు. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ‘మూకుత్తి అమ్మన్’లోనూ ఎల్.ఆర్.ఈశ్వరి కనిపించారు. ఈ సినిమా తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా అనువాదమయింది. 82 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ గాయనీమణి మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.