కోలీవుడ్ హీరో శింబు రాబోయే సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘మానాడు’. ఈ చిత్రం నవంబర్ 25న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి చెన్నైలో జరిగింది. తన ప్రసంగంలో శింబు భావోద్వేగానికి లోనవుతూ, కన్నీళ్లు పెట్టుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఆ సమయంలో చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, శింబు స్నేహితుడు, నటుడు మహత్ వేదికపై శింబును ఓదార్చవలసి వచ్చింది.
కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్లను ప్రస్తావించకుండానే శింబు అన్నారు. “నేను చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. కానీ వాటన్నింటినీ నేను చూసుకుంటాను. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ శింబు తన అభిమానులను కోరాడు. శింబు ప్రసంగానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారాయి. తమ అభిమాన నటుడు వేదికపైనే ఇలా కన్నీటి పర్యంతం కావడంతో వారు సోషల్ మీడియా వేదికగా అతడిని తమ ప్రేమతో ముంచెత్తారు.
Read Also : వర్షంలోనూ తగ్గని ‘పెద్దన్న’ జోరు
గత దశాబ్ద కాలంగా శింబు తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి అనేక వివాదాలను ఎదుర్కొంటున్నాడు. శింబు సహకరించకపోవడంతో తమిళ నిర్మాతల మండలి ఆయనకు రెడ్ కార్డ్ కూడా జారీ చేసింది. ‘మానాడు’ నిర్మాత సురేష్ కామచ్చి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం ఆలస్యం కావడానికి శింబు కారణమని ఆయనను ‘మానాడు’ నుండి బహిష్కరించారు. దీనికి ప్రతిగా శింబు తన తండ్రి టి రాజేంధర్‌తో ‘మాఘ మానాడు’ అనే చిత్రాన్ని కూడా ప్రకటించాడు. కానీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తరువాత శింబు తన విభేదాలను పరిష్కరించుకుని మళ్ళీ ‘మానాడు’ను పూర్తి చేశాడు.