ఏపీలో టికెట్ రేట్ల విషయమై ఎన్ని విమర్శలు వచ్చిన్నా ప్రభుత్వం ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ముందుకు సాగుతోంది. సినీ పెద్దలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని సాగదీస్తోంది. తెలంగాణాలో థియేటర్ల పార్కింగ్ ఫీజు కంటే ఆంధ్ర్రాలో టికెట్ రేట్లు తక్కువగా ఉండడం అక్కడి డిస్ట్రిబ్యూటర్లను కలవర పెడుతోంది. మరోవైపు ప్రభుత్వం మొండి వైఖరికి సెలెబ్రిటీలు సైతం విసిగిపోతున్నారు. దీంతో డైరెక్ట్ గానే ప్రభుత్వంపై కౌంటర్లు వేస్తున్నారు. నిన్న నాని తన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
10 మందికి ఉద్యోగాలు ఇచ్చే థియేటర్ యజమాని కౌంటర్ కన్నా పక్కనే ఉన్న కిరాణా కొట్టు కౌంటర్ బెటర్ గా ఉందంటూ ఆంధ్రాలో టికెట్ రేట్ల సమస్యపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు అది ప్రేక్షకులను అవమానించడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాని వ్యాఖ్యలతో మరోమారు సినిమా ఇండస్ట్రీలో దుమారం రేగింది. కొంతమంది నానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే, మరికొంత మంది ఏపీ ప్రభుత్వం తరపున నిలబడుతున్నారు. నాని వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి బొత్స ‘ప్రతి వస్తువుకు టీఆర్పీ ఉంటుంది. టికెట్ రేట్లకు ఎందుకు లేదు. మీరు టికెట్ రేట్ల పేరుతో వేలకు వేలు దోచుకుంటే చూస్తూ ఊరుకుంటామా ? ప్రజలకు అన్నీ అందుబాటు ధరలోనే ఉండేటట్టుగా చూస్తాము… టికెట్ రేట్లతో సహా…’ అంటూ చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం తరపున ఆయన చేసిన వ్యాఖ్యలపై ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. తాజాగా సిద్దార్థ్ మరోసారి సంచలన ట్వీట్స్ చేశారు. “సినిమా ఖర్చు తగ్గించి, డిస్కౌంట్‌ను కస్టమర్‌లకు పంచాలని మాట్లాడే మంత్రులు… మేం పన్ను చెల్లింపుదారులం. మీ విలాసాలన్నింటికీ మేం చెల్లిస్తున్నాం…+ లక్షల కోట్లను రాజకీయ నాయకులు అవినీతితో సంపాదించారు… మీ విలాసాలు తగ్గించుకోండి. మా తగ్గింపు ఇవ్వండి. #ఏది లాజిక్ ?” అంటూ సంచలనాత్మక ట్వీట్ చేశారు.