Shyamala Devi: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఈ పేరు ఎన్నితరాల వారైనా మర్చిపోలేరు. ఆతిధ్యానికి మరో పేరు అంటే కృష్ణంరాజు అనే చెప్తారు. కృష్ణంరాజు 1966లో చిలకా గోరింక సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఈ సినిమా తరువాత ఆయన వెనుతిరిగి చూసుకున్నది లేదు. ఎన్నో చిరస్మరణీయ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో ఉత్తమనటుడిగా స్థానం సంపాదించుకున్నారు కృష్ణంరాజు. నటనతోనే కాకుండా రాజకీయాల్లోనూ చేరి ప్రజాసేవలోనూ నిరూపించుకున్న ఆయన 2022 సెప్టెంబర్ 11న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఇంకా ఆయన మరణవార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఎక్కడకు వెళ్లినా భార్య లేకుండా కృష్ణంరాజు వెళ్లేవారు కాదు. శ్యామలా దేవి.. కృషంరాజు రెండో భార్య. మొదటి భార్య సీతాదేవి. ఆమె చెన్నైలో షాపింగ్ కు వెళ్లి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించింది. ఇక అంతకు ముందే వారికి ఒక మగబిడ్డ పుట్టగా.. వైద్యుల నిర్లక్ష్యంతో ఆ బిడ్డ కూడా మృతి చెందాడు.
” నాకు కృషంరాజు గారు ముందు నుంచి తెలుసు. ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఎప్పుడు దానధర్మాలు చేస్తూ ఉంటారని మా ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు విన్నాను. భార్యను, కొడుకును పోగొట్టుకొని ఎంతో దుఃఖంలో ఉండేవారట. ఇక దీంతో కృష్ణంరాజు గారి నాన్నగారు.. కొడుకు గురించి మదనపడేవారు. నా కొడుకు అందరి ఆకలి తెలుసుకొని అన్నం పెడుతూ ఉంటాడు. కానీ, వాడి ఆకలి వాడికే తెలియదు. భార్య ఉంటే ఆమె వాడి ఆకలి తీరుస్తుంది అని అనుకొని ఆయనకు రెండో పెళ్లి చేయాలనుకున్నారు. అయితే రెండో పెళ్ళికి కృష్ణంరాజు గారు ఒప్పుకోలేదు. కానీ, మామయ్య గారు రెండు మూడు రోజులు నిరాహార దీక్ష చేసి.. ఆయన్ను పెళ్ళికి ఒప్పించారు. ఇక మా బంధువుల ద్వారా మామయ్యకు నా గురించి తెల్సింది. అప్పటికే నాకు ఆయనకు పెళ్లి అయ్యిందని, భార్య యాక్సిడెంట్ లో చనిపోయిందన్న విషయం తెలుసు. ఇక ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టి నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ, మా అమ్మ ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. రెండో పెళ్లి.. పిల్లలు కావాలనుకుంటారో, లేదో.. అని ఎన్నో అనుమానాలతో ఈ సంబంధాన్ని పెద్దగా ఇష్టపడలేదు. నేను నచ్చజెప్పి ఓకే చెప్పించాను. అయితే.. కృష్ణంరాజు గారు మాత్రం.. నేను చిన్నపిల్లను.. నన్ను బలవంతంగా ఒప్పించారని అనుకున్నారు. అసలు విషయం కనుక్కోమని తన కజిన్‌ను నా దగ్గరకు పంపించగా.. నేను ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నానని చెప్పాను. అలా మా పెళ్లి జరిగింది. ఆయనే నాకు సర్వసం.. నాకు తల్లీతండ్రీ, గురువు, దైవం, సర్వస్వం అంతా కృష్టం రాజుగారే.. ఇప్పుడు ఉన్న నేను.. నేను కాదు. ఆయన జ్ఞాపకాలతో మిగిలిఉన్నాను అంతే” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.