పూణేకు చెందిన శ్వేతా అవస్తి మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. మోడలింగ్ తో పాటు కమర్షియల్ యాడ్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘మళ్ళీ మళ్ళీ చూశా’ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఆమెకు లభించింది. తాజాగా శ్వేతా అవస్తి నటించిన రెండో సినిమా ‘మెరిసే మెరిసే’ శుక్రవారం విడుదలైంది. ఇందులో నటించిన వెన్నెల పాత్రకు మంచి అప్లాజ్ వస్తోందని శ్వేతా అవస్తి చెబుతోంది. రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చిన వెన్నెల అనే అమ్మాయి, ఫ్యాషన్ డిజైనర్ గా తన కాళ్ళ మీద తాను నిలబడటం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసిందన్నదే ‘మెరిసే మెరిసే’ చిత్ర కథ అని తెలిపింది. కో-స్టార్ ‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ తెలుగు సంభాషణల విషయంలో ఎంతో సహకారం అందించాడని చెప్పింది. కీర్తి సురేశ్ అంటే అభిమానమని, ఆమెలానే వైవిధ్యమైన పాత్రలు చేయాలనే భావన ఉందంటూ, ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నానని, ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ను లడక్ లో పూర్తి చేశానని శ్వేతా అవస్తి తెలిపింది.