సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో హఠాన్మరణం చెందారు. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగానే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. అయితే విద్యాసాగర్ మరణానికి పావురాల నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ కారణమని తమిళ మీడియా కథనాలు వెల్లడిస్తోంది. మీనా కుటుంబం నివసించే ఇంటి సమీపంలో చాలా పావురాలు ఉంటాయని.. వాటి వ్యర్థాలు కలిసిన గాలి పీలుస్తుండటంతో ఇంట్లో అందరి లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ సోకిందని తమిళ మీడియా వివరిస్తోంది. అయితే విద్యాసాగర్‌కు గతంలో కోవిడ్ రావడంతో అతడిలో లంగ్స్ ఇన్ఫెక్షన్ సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా విద్యాసాగర్ ఊపిరితిత్తులు మార్చాలని డాక్టర్లు ప్రయత్నించినా ఆర్గాన్ డోనర్ దొరకక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తమిళ మీడియా తమ కథనాల్లో రాసుకొచ్చింది.
Read Also: Meena: సీనియర్ నటి మీనా భర్త కన్నుమూత
కాగా మీనా భర్త విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశానవాటికలో జరగనున్నాయి. మరోవైపు విద్యాసాగర్ మృతి పట్ల పలువురు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. విద్యాసాగర్ మృతిపై నటి ఖుష్బూ స్పందిస్తూ.. ‘దారుణమైన వార్తతో నిద్రలేచాను. మీనా భర్త మృతి చెందారని తెలియడంతో షాక్‌లో ఉన్నా. జీవితం చాలా దారుణమైనది. ఇప్పుడు నా మనసు మీనా, ఆమె ఫ్యామిలీ గురించి ఆలోచిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు నటుడు శరత్ కుమార్ కూడా మీనా భర్త మృతి పట్ల సంతాపం తెలియజేశారు. మీనా, విద్యాసాగర్ ఇద్దరూ తన ఫ్యామిలీకి చాలా క్లోజ్అని.. విద్యాసాగర్ అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని.. వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతి అంటూ శరత్ కుమార్ పేర్కొన్నారు.