సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ఎంతగానో ఉంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పలువురిని ప్రభావితం చేస్తాయి. అలా జ్యోతిక నటించిన 2020 కోర్టు డ్రామా ‘పొన్మగల్ వందాల్’ ఈ కోవకే చెందుతుంది. ఈ సినిమా చూసి తమిళనాడులో తొమ్మిదేళ్ల అత్యాచార బాధితురాలు 48 ఏళ్ల బంధువు వల్ల లైంగిక వేధింపులకు గురైనట్లు కుటుంబ సభ్యులకు వెల్లడించింది. దాంతో వారు నిందితుడిపై ఫిర్యాదు చేశారు. మద్రాస్ హైకోర్టు కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘నిశ్శబ్దాన్ని ఛేదించండి! ఒక మహిళ తనకు తానుగా అండగా నిలబడుతుంది. అంతే కాదు ఆమె అందరు మహిళల కోసం నిలబడుతుంది’ అన్నారు.
‘పొన్మగల్ వందాల్’లో రేప్ కేసులు భారతదేశ న్యాయస్థానాలలో ఎలా డీల్ చేయబడుతున్నాయనే అంశం గురించి చిత్రీకరించారు. మన దేశంలో చట్టపరమైన ప్రక్రియలు ఎంత సమయం తీసుకుంటున్నాయో కూడా చూపించారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో అన్ని విషయాల గురించి ధైర్యంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పిన సన్నివేశం ఈ సినిమాలో ఉంది. ఈ సినిమాకు జెజె ఫ్రెడ్రిక్ దర్శకత్వం వహించారు. హీరో సూర్య దీనిని నిర్మించారు.