Jagadeesh Prataap: తెలుగువారి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సత్తిగాని రెండు ఎకరాలు’. అభినవ్ దండా దీనికి దర్శకుడు. ఈ సినిమా మార్చి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ దాన్ని నిర్మాతలు వాయిదా వేశారు. ఈ సినిమాతో ‘పుష్ప’ ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి హీరోగా మారాడు. ‘వెన్నెల’ కిశోర్, బిత్తిరి సత్తి, మోహనశ్రీ సురాగ, రాజ్ తిరందాసు, అనీషా దామా ఇతర కీలక పాత్రలను పోషించారు. గ్రామీణ ప్రాంతాల జీవితాలకు అద్దంపట్టేలా ఈ సినిమాను అభినవ్ తెరకెక్కించాడు. జగదీష్ ప్రతాప్ ఇప్పటి వరకు చేయనటువంటి ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. కూతురు కోసం సర్వస్వం త్యాగం చేయాలనుకునే తండ్రి పాత్రను అతను పోషించాడు.
ఈ మూవీ గురించి నిర్మాతల్లో ఒకరైన మైత్రీ మూవీ మేకర్స్ వై. రవిశంకర్ మాట్లాడుతూ ‘‘ఎంతో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి ‘సత్తిగాని రెండెకరాలు’ స్క్రిప్ట్ చేశాం. ప్రేక్షకులకు ఎప్పుడూ ఏదో కొత్తగా చెప్పాలని, వారిని వినోదింపజేయాలనేది ఫిల్మ్ మేకర్‌గా నా ఆలోచన. అందులో భాగంగానే ఆహాతో కలిసి ఈ సినిమాను నిర్మించాం. ఏప్రిల్ 1న దీనిని విడుదల చేస్తాం’’ అని అన్నారు. చిత్ర దర్శకుడు అభినవ్ దండా మాట్లాడుతూ ‘‘ఇది నా మనసుకు ఎంతో దగ్గరైన కథ. ఎమోషన్స్, కామెడీ, ట్విస్టులున్న ఇలాంటి కథను స్క్రీన్ మీదకు ఎక్కించడం ఛాలెంజింగ్ గా అనిపించింది. లైఫ్ గొప్పతనం ఏంటనేది చెబుతూనే, అప్పడప్పుడు అనుకోకుండా జరిగే కొన్ని ఘటనలు కొందరి జీవితాలను ఎలా మారుస్తాయనే విషయం గురించి ఈ చిత్రంలో చూపించాం. తప్పకుండా అన్ని వర్గాల వారికీ నచ్చుతుందని భావిస్తున్నాను ’’ అని అన్నారు.