టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అంతేకాదు… హిందీలోనూ ‘రామ్ సేతు’ లాంటి చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ నెల 17న అతను నటించిన ‘గాడ్సే’ మూవీ విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే సరిగ్గా దానికి ఒక నెలలోనే సత్యదేవ్ మరో సినిమా ‘గుర్తుందా శీతాకాలం’ రాబోతోంది. ఈ సినిమాను జూలై 15న విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు గురువారం తెలిపారు. కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’ కు ఇది రీమేక్. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ ఫుల్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలు ప్రేక్షకులకి గుర్తు చేసేలా నాగశేఖర్ దీనిని తెరకెక్కించారు. ఈ సినిమాను భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్మెస్ రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు కీరవాణి తనయుడు, సింగర్, కాలభైవర సంగీతాన్ని సమకూర్చాడు.
‘ది వారియర్’తో పోటీ!
ఇదిలా ఉంటే… జూలై 14న రామ్ నటించిన ‘ది వారియర్’ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటించగా, ప్రతినాయకుడి పాత్రను ఆది పినిశెట్టి పోషించాడు. అలానే ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి నటించిన హీరోయిన్ సెంట్రిక్ మూవీ ‘హ్యాపీ బర్త్ డే’ జూలై 15న విడుదల కాబోతోంది. దీనిని ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా తెరకెక్కించాడు. మరి ఈ మూడు చిత్రాలతో పాటు ఆ సమయానికి ఇంకా ఏ యే సినిమాలు వస్తాయో చూడాలి.