Satya Dev Shares Some Interestings Facts About Godfather Film: ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోందీ సినిమా. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ విలేకరులతో ముచ్చటించారు.
‘గాడ్ ఫాదర్’లో అవకాశం రావడం గురించి చెబుతూ, ”చిరంజీవి అన్నయ్య ఒక షూటింగ్ లో లంచ్ కి రమ్మని పిలిచారు. వెళ్లాను. ఒక సినిమా ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. అన్నయ్య నాకు కథ చెప్పడం ఏమిటని ఆశ్చర్యంగా చూస్తున్నాను. నేను ఎప్పుడూ కలలో కూడా కనని వింత అనుభవం అది. నేను ఆయనకి వీర అభిమానిని. నేను గురువుగా భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నాకు కథ, పాత్ర చెప్పడం ఆశ్చర్యమనిపించింది. ఆయన నా వంక చూసి ”నేను సరిగ్గా కథ చెప్పడం లేదా? పోనీ దర్శకుడితో చెప్పించనా?” అని అడిగారు. ”మీరు నాకు కథ చెప్పడం ఒక కలలా వుంది, నాకేం అర్ధం కావడం లేదన్నయ్యా! మీరు చేయమని చెప్తే చేసేస్తాను. మీరు కథ చెప్పడం ఏంటి ” అన్నాను. సినిమా చూశావా ? అని అడిగారు. ”చూడలేదు, చూడను కూడా. చేసేస్తాను” అని చెప్పాను” అని అన్నారు. తన నటనను చిరంజీవి ప్రశంసించిన విషయం గురించి మాట్లాడుతూ, ”ఈ పాత్ర చేస్తున్నప్పుడు అన్నయ్య ప్రశంసలు విన్నాను. దాని గురించి మాటల్లో చెప్పలేను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అన్నయ్యని ఇష్టపడ్డాను. యాక్టర్ కావాలని కలలు కన్నాను. ఆయనపై వున్న ప్రేమని ఇంధనంగా వాడుకొని నటుడిని అయ్యాను. అన్నయ్య నా నటనని ప్రశంసించడం మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. నా కల నేరవేరింది” అని చెప్పారు.
‘గాడ్ ఫాదర్’ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకుంటూ, ”మాటల రచయిత లక్ష్మీ భూపాల హాయిగా మాటలు రాసేశారు. మోహన్ రాజా గారు మానిటర్ ముందు కూర్చుని యాక్షన్ చెప్తారు. వీళ్ళందరికంటే వార్ లో వున్నది నేను. అన్నయ్య చాలా చాలా కంఫర్ట్ జోన్ లో ఉంచారు. ఆయన షాట్ అయిపోయిన తర్వాత కూడా నాకు హెల్ప్ చేయాలని నా పక్కనే వుండేవారు. అయితే ఆయన పక్కన వుంటే నాకు టెన్షన్). నటుడిగా అన్నయ్య నా మీద ఒక బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించాల్సి వుంది. దాని ముందు మిగతా భయాలు తగ్గాయి. అన్నయ్య గ్రేస్, ఆరాకి వంద శాతం సరిపడే కథ ఇది. లుక్ కూడా పూర్తిగా మార్చారు. మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. సీన్లు పేల్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ నా ఫేవరేట్. మాములుగా వుండదు. మోత మోగిస్తుంది. ‘థార్ మార్’ పాట కూడా అదిరిపోతుంది. క్లైమాక్స్ లో 14 నిమిషాల యాక్షన్ సీన్ ఇందులో ఒక హైలెట్. దీనికంటే మించి ఇందులో చాలా వున్నాయి. ఆద్యంతం ఎత్తుకుపై ఎత్తు అన్నట్టుగా వుంటుంది” అని చెప్పారు.
సల్మాన్ ఖాన్ తో కలసి వర్క్ చేయడం గురించి చెబుతూ, ”ఆయన సూపర్ కూల్. పెద్ద సూపర్ స్టార్ అయినా, సెట్స్ లో చాలా సింపుల్ గా సరదాగా వున్నారు. స్టార్లు అంతా ఇలానే వుంటారు. సల్మాన్ మాత్రం ఇంకొంచెం ఎక్కువ కూల్ పర్శన్ లా అనిపించారు. దర్శకుడు మోహన్ రాజా సైతం కూల్ పర్సనే. ఆయన చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ప్రతి పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా విలన్ పాత్రని, నా పాత్రని చాలా స్టయిలిష్, పవర్ హంగ్రీ, గ్రీడీ గా చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఇలాంటి పాత్రని ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ఈ పాత్ర చాలా అద్భుతంగా వచ్చింది” అని చెప్పారు. సెట్స్ పై ఉన్న సినిమాల గురించి చెబుతూ, ”గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ, రామ్ సేతు’ విడుదలకు సిద్దంగా వున్నాయి. ‘ఫుల్ బాటిల్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో డాలీ ధనుంజయతో కలసి ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్న. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని సత్యదేవ్ తెలిపారు.