Sampath Nandi On Odela Railway Station Remuneration: హెబ్బా పటేల్, వశిష్ట ఎన్.సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఓదెల రైల్వే స్టేషన్’. కె.కె.రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథను అందించారు. ఆగస్ట్ 26 నుంచి ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రా అండ్ రస్టిక్, ఇన్‌టెన్స్ మూవీగా తెరకెక్కిన ‘ఓదెల రైల్వేషన్’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా శుక్రవారం చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకుంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు షీల్డులను అందించటంతో పాటు కేక్ కట్ చేసింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ ”లాక్డౌన్‌లో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నప్పుడు మొదలైన జర్నీ ఇది. ఈ సక్సెస్ ఇద్దరిది. అందులో ఒకరు అశోక్ అయితే, మరొకరు ఆహా. ఈ సినిమాను అశోక్ కోసమే చేశాను. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సక్సెస్ తనకే దక్కుతుంది. లోకల్ కంటెంట్ రీచ్ కావాలంటే లోకల్ ఛానెల్ ద్వారానే బావుంటుంది. అలాంటి కనెక్షన్ మాకు ఆహా ద్వారా లభించింది. బాబు, వినయ్, బాల ద్వారా మాకు అది దొరికింది. రాధా మోహన్‌గారితో నాకు ఇది థర్డ్ కాంబినేషన్. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లలో చాలా మంది నా మీద గౌరవంతో రెమ్యునరేషన్స్ తీసుకోకుండా పని చేశారు. వారందరికీ కూడా థాంక్స్. ఓదెల మా ఊరు. మా ఊరి పేరుపై సినిమా చేయటం గర్వంగా అనిపిస్తోంది. ప్రదీప్, గణేష్, శ్రీకాంత్ సినిమా లాంగ్వేజ్ పరంగా ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్” అని అన్నారు. నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ, ”’ఏమైంది ఈవేళ’ చిత్రం నుండి సంపత్ నందితో అనుబంధం కొనసాగుతోంది. పెద్ద సినిమాలకు పని చేసిన డీఓపీ సౌందర్ రాజన్ మా ‘ఓదెల రైల్వేస్టేషన్’కు వర్క్ చేయటం చాలా సంతోషానిచ్చింది. కోవిడ్ సమయంలో చాలా కేర్ తీసుకుని షూటింగ్ చేశాం. మా సినిమాను నమ్మి దాన్ని ప్రేక్షకులకు అందించటానికి ముందుకు వచ్చిన ఆహా యాజమాన్యానికి ధన్యవాదాలు. ఈ సినిమా కంటే ముందు ‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీని కూడా ఆహా డైరెక్ట్ రిలీజ్ చేసింది” అని చెప్పారు.
హెబ్బా పటేల్ మాట్లాడుతూ ”సంపత్ సార్ స్క్రిప్ట్ నెరేట్ చేస్తానని ఫోన్ చేసి వచ్చి కలిశారు. నా కంఫర్ట్ జోన్‌కు పూర్తి భిన్నమైన జోనర్ మూవీ అని ఆయన నెరేషన్ వినగానే అర్థమైంది. అయితే సంపత్ గారు నాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా నేను చేయగలనా అని షూటింగ్ ముందు వరకు అనుకుంటుండేదాన్ని. ఐదారు రోజుల తర్వాత.. రాధ పాత్రలోకి వెళ్లాను. నా కంఫర్ట్ జోనర్‌ను వదిలేశాను. ఇప్పుడు నా పాత్రకు చాలా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. వశిష్ట్, సాయి రోనక్, గగన్ సహా అందరికీ థాంక్స్” అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అశోక్ తేజతో పాటు గగన్, సాయి రోనక్, వశిష్ఠ ఎన్ సింహా, దివ్య, నాగ మహేష్, సురేందర్ తదితరులు పాల్గొని తమ అనుభవాలను వివరించారు.