Samantha To Play Cop Role In Thalapathy67: నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సమంత కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఒకదాని తర్వాత మరొక క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్‌లో పెడుతోంది. వాటిల్లో విజయ్ – లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తమిళ సినిమా ఒకటి. ఇందులో సమంత ఓ నెగెటివ్ రోల్‌లో కనిపించనుందని ఇదివరకే రివీల్ అయ్యింది. తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ తెరమీదకొచ్చింది.
సినీ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం.. సమంత ఇందులో పోలీస్ అధికారిణి పాత్ర పోషిస్తోందట! నెగెటివ్ షేడ్స్ గల ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. సమంత ఇదివరకే ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ సినిమాలో నెగెటివ్ రోల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, జాతీయంగా మన్ననలు చూరగొంది. ఆ వెబ్ సిరీస్ తర్వాత ఈమె పాన్ ఇండియా నటిగా అవతరించిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అంతకుముందు విక్రమ్ ‘10’ సినిమాలోనూ నెగెటివ్ షేడ్స్‌లో నటించి, అదరహో అనిపించింది. ఇప్పుడు మరోసారి అలాంటి ఛాలెంజింగ్ రోల్‌లో సమంత నటిస్తుండడం, పైగా పోలీస్ రోల్ కావడంతో.. ఈసారి ఎలా రాణిస్తుందన్న క్యూరియాసిటీ నెలకొంది.
కాగా.. సమంత చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతున్నాయి. ‘యశోద’ ఆగస్టు 12న రావాల్సింది కానీ, ఇంకా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేయనున్నట్టు తెలిసింది. ఇక శాకుంతలం చిత్రీకరణ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కడంతో, ‘శాకుంతలం’పై భారీ అంచనాలే ఉన్నాయి.