మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌లో తొలి యత్నంగా ‘షూట్ ఎట్ ఆలేర్’ వెబ్ సిరీస్ తీశారు. ఆ తర్వాత ఓటీటీ కోసం ‘సేనాపతి’ మూవీ చేశారు. ఇంత వరకూ కంటెంట్ ప్రధానంగా డిజిటల్ మీడియా కోసం వెబ్ సీరిస్, ఓటీటీ ఫిల్మ్ తీసిన సుస్మిత ఇప్పుడు ఫస్ట్ టైమ్ థియేట్రికల్ రిలీజ్ కోసం ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. అదే ‘శ్రీదేవి శోభన్ బాబు’ మూవీ. సంతోష్ శోభన్, ‘జాను’ ఫేమ్ గౌరి జి. కిషన్ జంటగా నటిస్తున్న ఈ మూవీ ద్వారా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బుధవారం యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ చేతుల మీదుగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జెమినీ కిరణ్ సైతం హాజరయ్యారు. సోషల్ మీడియాలో సమంత ఈ టీజర్‌ను పోస్ట్ చేసింది.
తొలుత దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల మాట్లాడుతూ.. ‘నేను చిరంజీవిగారి అభిమానిని. సంతోష్ శోభన్‌తో కలిసి కాఫీ షాపులో మాట్లాడుతుండగా ఒకసారి సుస్మిత గారు పిల్లలతో అక్కడికి వచ్చారు. ఆమెను పరిచయం చేసుకుని సినిమా కోసం కథలు రాస్తున్నట్టు చెప్పాను. ఆ తర్వాత పది రోజులకే నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు ఆమెకు చెప్పిన కథే ఈ మూవీ. ఈ చిత్రానికి నాకు బెస్ట్ టెక్నీషియన్స్ దొరికారు. నాగబాబు, రోహిణితో పాటు మంచి ఆర్టిస్టులు లభించారు. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
సుస్మిత మాట్లాడుతూ.. ‘నాన్నగారి ఆశీస్సులతో ఈ సినిమాను మొదలు పెట్టాం. ఆయనకు తొలి చిత్రం ఎలానో.. నాకు అలా ఇది ఫస్ట్ బేబీ. అందరి ఆశీస్సులు నాకు ఉంటాయని భావిస్తున్నాను. ఇంతవరకూ సీరియస్ సబ్జెక్స్ తీసుకుని ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు, సేనాపతి’ తీశాం. ఇప్పుడు కాస్తంత రూట్ మార్చి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్‌గా ‘శ్రీదేవి శోభన్ బాబు’ ఫీచర్ ఫిల్మ్ ను నిర్మించాం. అందరికీ ఇది నచ్చుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ చాలా చక్కగా ఈ కథను తెరకెక్కించాడని విష్ణు ప్రసాద్ అభినందించారు. ‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సుస్మిత, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్న తొలి ఫీచర్ ఫిల్మ్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని సిద్ధు జొన్నలగడ్డ అన్నాడు. ‘ఊహించని విధంగా ఈ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ దక్కింద’ని మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడైన ప్రశాంత్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేసిన సుస్మితకు హీరో సంతోష్ శోభన్ ధ్యాంక్స్ చెప్పాడు. చక్కని ప్రతిభ ఉన్న ప్రశాంత్ భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవుతాడనే నమ్మకం ఉందని తెలిపాడు. ‘తొలిసారి తెలుగులో తాను ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కావడం ఆనందంగా ఉందని, ఓ ఫన్నీ ట్రిప్ కు వెళ్ళినట్టుగా షూటింగ్ సాగిపోయింద’ని గౌరి జి కిషన్ తెలిపింది. అతి త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.
https://twitter.com/Samanthaprabhu2/status/1511682666206470148