ఫిదా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై అందరి హృదయాలను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఇటీవలే విరాటపర్వం చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె ప్రస్తుతం గార్గి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అన్ని భాషల్లో జూలై 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ చిత్ర విశేషాలను పంచుకుంటుంది. ఇక తాజాగా ఆమె త్వరలో నిర్మాతగా మారే అవకాశాలు కూడా ఉన్నట్లు చెప్పుకురావడం విశేషం.
గార్గి సినిమాను తెలుగులో రానా సమర్పిస్తుండగా.. తమిళ్ లో జ్యోతిక- సూర్య దంపతులు రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ” మొదట ఈ సినిమాకు నా పేరే సమర్పకురాలిగా వేస్తామని చెప్పారు. నేను వద్దని చెప్పాను. నా సినిమాను నేను సమర్పించుకోవడం ఏంటి..? నా దగ్గరకు మంచి కథ వస్తే.. దానిని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ నా మనసును హత్తుకొని, ఈ సినిమాను నేను నిర్మిస్తే బావుంటుందని నాకు అనిపించినప్పుడు పూర్తి నిర్మాతగా మారతాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలతో ఆమె త్వరలోనే నిర్మాతగా మారుతుందని అర్ధమవుతోంది. ప్రస్తుతం డాన్సర్, యాక్టర్, డాక్టర్ గా పేరుతెచ్చుకున్న ఆమె త్వరలో నిర్మాత గా కూడా మారనున్నదన్నమాట. మరి సాయి పల్లవి నిర్మించే ఆ సినిమా ఎలా ఉండనున్నదో చూడాలి.