కళారంగంలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రతి సంవత్సరం సత్కరించడం తమిళనాడు ప్రభుత్వ ఆనవాయితీ. ఆ క్రమంలో బుధవారం ప్రభుత్వం 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను కలైమామణి పురస్కారాలను ప్రకటించింది. ప్రతి ఏడాది 30 మందికి చొప్పున, మూడు సంవత్సరాలకు కలిపి మొత్తం 90 మంది కళాకారులు ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.
2021 సంవత్సరానికి సౌత్ ఇండస్ట్రీలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి, అలాగే నటుడు ఎస్. సూర్యలను ఎంపిక చేశారు. సినీ రంగంలో వీరిద్దరి కృషిని గుర్తించిన ఈ అవార్డు, వారి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. అలాగే ప్రస్తుతం సంగీత ప్రపంచంలో ట్రెండింగ్ కంపోజర్‌గా కొనసాగుతున్న అనిరుధ్ రవిచందర్‌కు 2023 సంవత్సరానికి కలైమామణి అవార్డు దక్కింది. తన వినూత్నమైన మ్యూజిక్ స్టైల్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న అనిరుధ్‌కు ఇది ప్రతిష్టాత్మక గౌరవంగా భావిస్తున్నారు.
జాతీయ విభాగంలో, భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండ్‌గా నిలిచిన కె.జె. యేసుదాస్‌కు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పురస్కారంను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గౌరవం ఆయన సంగీత పయనానికి మరింత ప్రత్యేకతను జోడించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్‌లో చెన్నైలో జరిగే అవకాశం ఉంది. ప్రతిభను గుర్తించి గౌరవించే ఈ వేదికపై అనేక మంది కళాకారులు ఒకే చోట చేరి సంబరాలు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.