Rx 100 and Baby Movies with same formula: తెలుగువారనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా స్త్రీకి ప్రాముఖ్యత ఎక్కువ. నిజానికి భారతదేశవ్యాప్తంగా పితృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు కూడా అగ్ర తాంబూలం అమ్మకే ఇస్తూ ఉండేవారు. అందుకే అన్నింటి కంటే ముందు మాతృదేవోభవ అంటూ అమ్మకే మొదటి స్థానం ఇచ్చారు. ఈలెక్కన స్త్రీకి భారతదేశవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత, గౌరవం ఇస్తున్నారో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. అలాంటి స్త్రీ గురించి సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాల్లో తప్పుగా చూపించడం అంటే అదొక పెద్ద పాపం లాగా భావిస్తూ ఉండేవారు ఒకప్పుడు. అయితే ఈరోజు ఉన్న పరిస్థితుల ప్రకారం అటు అబ్బాయిలు ఇటు అమ్మాయిలు ఎవరూ తక్కువ తినడం లేదు. అన్ని విషయాల్లో ఎలా అయితే పోటాపోటీగా ఉంటున్నారో. నేరాలు చేసే విషయంలో అలాగే ప్రేమించిన వారిని మోసం చేసే విషయంలో కూడా ఒకరితో ఒకరు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్య గనక మనం పరిశీలిస్తే ఎక్కువగా ప్రియురాలు చేతిలో మోసపోయి ప్రియుడి ఆత్మహత్య అనే వార్తలు ఎక్కువ అవుతున్నాయి. బహుశా ఇలాంటి వార్తలు చూసే ప్రేరేపితులవుతున్నారో ఏమో తెలియదు కానీ దర్శకనిర్మాతలు కూడా లవ్ స్టోరీలు ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తే లేదా మోసం చేస్తున్నట్టు భ్రమింప చేసే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం ఇలాంటి ఒక కథతోనే సినిమా వచ్చింది. ఆర్ఎక్స్ 100 పేరుతో అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమాలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించాడు. రెండు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపు 28 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఒక్కసారిగా ట్రేడ్ వర్గాల వారందరికీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఆ సినిమాలో రావు రమేష్ అనే ఒక క్యారెక్టర్ తప్ప మిగతా ఏ క్యారెక్టర్ పోషించిన నటుడుగాని నటి కానీ లేదా దర్శక నిర్మాతలు ఇతర టెక్నీషియన్లకు కూడా క్రేజ్ లేదు. అప్పటివరకు రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అజయ్ భూపతి ఈ సినిమాతో డైరెక్టర్ గా మారగా సినిమా నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో హీరో సొంతంగా తన బాబాయ్ చేత సినిమాని నిర్మింప చేశాడు.
Pawan Kalyan: రేణు దేశాయ్ ఫోటో షేర్ చేసిన పవన్.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఫిదా చేశాడే
ఈ సినిమా మొత్తాన్ని యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కించాడు అజయ్ భూపతి. నిజానికి అమ్మాయిలు మోసం చేస్తున్నారనే విషయాన్ని ఇంత రా అండ్ రస్టిక్ గా ఇంకెవరూ చెప్పలేరేమో అనేట్టుగా తెరకెక్కించి వీడు మగాడ్రా బుజ్జి అనిపించుకున్నాడు. ఆ తరువాత చిన్నాచితకా సినిమాలు అమ్మాయిలను తప్పుగా చూపించే ప్రయత్నం చేసినా ప్రమోషన్స్ లేకనో లేక పెద్దగా యూత్ కి కనెక్ట్ అవ్వలేకనో తెలియదు కానీ అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. వాస్తవానికి అబ్బాయిల్లో, అమ్మాయిల్లో అందరూ మంచి వాళ్ళు లేరు, అలా అని చెడ్డవారు లేరు. కానీ లవ్ లో ఫెయిల్ అయిన అబ్బాయిలు అందరూ అమ్మాయిదే తప్పని ఫెయిల్ అయిన అమ్మాయిలు అందరూ అబ్బాయిలదే తప్పని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు బేబీ అనే సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ మరో హీరోగా బేబీ అనే సినిమాని సాయి రాజేష్ డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్ మారుతి, ఒకప్పటి జర్నలిస్ట్, ఇప్పుడు నిర్మాతగా మారిన ఎస్కేఎన్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా మొత్తం వైష్ణవి అనే క్యారెక్టర్ చుట్టూనే జరుగుతుంది, ఆమెకి ముద్దుగా బేబీ అనే పేరు పెట్టుకుని దాన్నే సినిమాకి టైటిల్ చేశారు. నిజానికి ముందు నుంచి ఆమె క్యారెక్టర్ ని మంచిగానే చూపిస్తూ వచ్చినా ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఇచ్చి ఆమె క్యారెక్టర్ ని పూర్తిస్థాయిలో బ్యాడ్ చేశారు. అలా చేసిన తర్వాత క్లైమాక్స్ కి కొంచెం సేపటి ముందు అర్ధాంతరంగా ఆమె క్యారెక్టర్ ని ముగిస్తారేమో అని హింట్ ఇచ్చి కుర్రాళ్ళు ఇగోలు సాటిస్ఫై చేసినట్టు అనిపించింది. అయితే ఆమె క్యారెక్టర్ ని ముగించకుండా మళ్లీ ఆమె క్యారెక్టర్ ని మంచిగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా చూసిన వారందరికీ గుర్తుండే ఉంటుంది, హీరో చేత హీరోయిన్ ని ఒక అసభ్యకరమైన మాట అనిపిస్తారు. నిజంగా ఆమె చేసింది తప్పే అని భావించిన క్రమంలో ఒకానొక దశలో ధియేటర్ మొత్తం ఆ అసభ్యకరమైన బూతే మారుమోగి పోయిందంటే కుర్రాళ్ళు అమ్మాయిలు చేసే మోసాల విషయంలో ఎంతలా కనెక్ట్ అయిపోయారో అర్థం చేసుకోవచ్చు.
ఒకానొక దశలో హీరోయిన్ ని చంపేందుకు హీరో సిద్ధమవుతున్న సమయంలో అన్ని థియేటర్లలో కరతాళ ధ్వనులు వినిపించాయి అంటే ఈ రోజుల్లో మోసం చేసిన లేదా మోసం చేసినట్టు అనిపించే అమ్మాయిలకి ఇదే సరైన శిక్ష అని అందరూ ఫిక్స్ అయిపోయినట్లు అనిపించింది. అయితే సినిమా క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఇచ్చాడు దర్శకుడు. ఎందుకంటే ఇప్పటికే ఎలాంటి క్లైమాక్స్ తీసినా దాదాపుగా ఏదో ఒక సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి చేశాడు అంటారు అనుకున్నారో ఏమో తెలియదు కానీ సైలెంట్ గా ఎవరూ ఊహించని క్లైమాక్స్ ఇచ్చి సినిమా ముగించారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం అవుతోంది, ఏంటంటే ఈ సినిమాకి కూడా పెద్దగా బడ్జెట్ పెట్టకుండానే తెరకెక్కించారు. ప్రమోషన్స్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అమ్మాయి క్యారెక్టర్ ని తప్పుగా చూపించి, దాన్ని జస్టిఫై చేసే ప్రయత్నం చేసిన ఈ సినిమాకి కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. కొంతమంది సినిమా బాగోలేదని చెబుతూనే ఇతరులను చూడమని ప్రోత్సహిస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే 14 కోట్ల మూడు లక్షల గ్రాస్ వసూలు చేసింది. అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే సినిమా డైరెక్టర్ కానీ హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇలా ఎవరూ క్రౌడ్ పుల్లర్స్ కాదు. కానీ సినిమాలో ఉన్న కంటెంట్, హీరోయిన్ హీరోలను ఒక రేంజ్ లో మోసం చేసింది అంటూ సోషల్ మీడియాలో వచ్చిన మీన్స్ చూసి చాలామంది సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే పాటలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ సినిమాను చూసి హీరో హీరోయిన్ల క్యారెక్టర్లలో తమనూ తమ ప్రేమికులను చూసుకుంటున్నారు. అయితే కుర్రాళ్ళు మాత్రం అమ్మాయిలను తప్పుగా చూపించారు కాబట్టి మనం దీన్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. ఏదేమైనా దర్శక నిర్మాతలకు మాత్రం ఈ సినిమా ఒక మంచి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదు.