RRR Movie Ready To Release In Japan: అదేంటి.. ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడో రిలీజయ్యింది కదా, పైగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది, మరి కొత్తగా ఇప్పుడు రిలీజ్ అవ్వడం ఏంటి? అని అనుకుంటున్నారా! ఆగండి, అక్కడికే వస్తున్నాం. ఈ సినిమా రిలీజవుతోంది ఇక్కడ కాదు, జపాన్‌లో! అవును.. ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన జపనీస్ భాషలో ఆర్ఆర్ఆర్‌ను జపాన్‌లో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్రబృందమే సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
తెలుగు సినిమాలకు జపాన్‌లోనూ మంచి ఆదరణ లభిస్తుందన్న విషయం అందరికీ తెలసిందే! ముఖ్యంగా.. జూ. ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా’ సినిమా అక్కడ డబ్ అయ్యింది. అంతేకాదు.. తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల పాటలకు అక్కడ విశేష క్రేజ్ ఉంది. జపాన్‌కి చెందిన యువత.. ఆ స్టార్ హీరోల పాటలకు కవర్ వీడియోలు చేస్తుంటారు. తారక్ పాటలకైతే అక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. దీనికితోడు.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓటీటీలో అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో, ఆర్ఆర్ఆర్‌ని జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. సో.. అక్కడి ఫ్యాన్స్ త్వరలోనే తమ అభిమాన హీరోలైన రామ్ చరణ్, తారక్‌లను వెండితెరపై చూడబోతున్నారన్నమాట!
కాగా.. మార్చి 25వ తేదీన విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా, బాక్సాఫీస్ వద్ద తాండవం చేసి రూ. 1100 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో.. భారత్‌లో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాల జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. అటు, ఓటీటీల్లోనూ ఈ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుండగా, జీ5లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. విదేశీ టెక్నీషియన్స్, ఇతర సెలెబ్రిటీలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.