Rewind 2022: కొత్త నీరు వచ్చి పాత నీటిని తోసేస్తుంటుంది. చిత్రసీమలో హీరోయిన్ల విషయంలో అదే జరుగుతూ ఉంటుంది. ప్రతి యేడాది వివిధ భాషల నుండి నూతన నాయికలు వస్తుంటారు. పాత కథానాయికలు నిదానంగా ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. ఆ రకంగా చూసినప్పుడు ఈ యేడాది సీనియర్ హీరోయిన్స్ కంటే.. కొత్తగా వచ్చిన వారే తెలుగు చిత్రసీమలో హంగామా సృష్టించారు. ఈ యేడాది ప్రారంభంలోనే వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ మూవీతో ఫర్నాజ్ శెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దిశ ఇన్సిడెంట్ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఆశ’తో సోనియా ఆకుల తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ నటించిన ‘వర్జిన్ స్టోరీతో ఏకంగా ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు సౌమికా పాండియన్, రిషికా ఖన్నా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
కొత్త కథానాయికలలో ఈ యేడాది వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్న భామ ఎవరైనా ఉన్నారంటే.. అది మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కీలక పాత్రలు పోషించిన ‘భీమ్లా నాయక్’లో సంయుక్త రానా భార్యగా నటించింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు భాషలో మాట్లాడి, అందరి మనసుల్నీ ఆకట్టుకుంది. విశేషం ఏమంటే ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ధనుష్ తో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘సార్’లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు.. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాలోనూ సంయుక్త ఛాన్స్ దక్కించుకుంది.
రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్.’ తోనూ ఇద్దరు నాయికలు తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. అందులో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ కాగా, మరొకరు విదేశీ నటి ఒలీవియా. విక్టరీ వెంకటేశ్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వగా విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ చిత్రంతోనూ మిధిలా పాల్కర్, ఆశాభట్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సారి మలయాళీ ముద్దుగుమ్మలే ఎక్కువగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సీనియర్ నటుడు రాజశేఖర్ టైటిల్ రోల్ పోషించిన ‘శేఖర్’ మూవీని జీవిత డైరెక్ట్ చేశారు. ఈ మూవీ ద్వారా మలయాళీ నటి ఆత్మీయ రాజన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలానే తమిళ, మలయాళ భాషల్లో ఇప్పటికే పలు చిత్రాలలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ భార్య నజ్రిమా నజీమ్ ‘అంటే సుందరానికి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఒకే యేడాది రెండు సినిమాలలో నటించిన ఘనతను సాయీ మంజ్రేకర్ అందుకుంది. మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటించిన ‘గని’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయీ. ‘గనీ’ ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ ఆమె నటించిన రెండో తెలుగు సినిమా ‘మేజర్’ చక్కని విజయం సాధించింది, దాంతో ఈ అందాలభామకు మంచి గుర్తింపు లభించింది.
ఈ యేడాది నటిగా మంచి మార్కులు పొందిన నూతన కథానాయికల జాబితాలో ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా నిలుస్తుంది. ఆమెలానే ఉత్తరాది నుండి దక్షిణాదిన అదృష్టం పరీక్షించుకున్న వారిలో చుంకీ పాండే కూతురు అనన్యా పాండే కూడా ఉంది. ఈమె విజయ్ దేవరకొండ ‘లైగర్’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తమిళ, మలయాళ చిత్రాలలో నటించిన ఐశ్వర్య లక్ష్మీ ‘గాడ్సే’ సినిమాతో పాటు ‘అమ్ము’లోనూ నటించింది. మొదటిది ధియేటర్లలో విడుదల కాగా, రెండో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. యానీ శీతల్ (కిన్నెరసాని), రజిషా విజయన్ (రామారావు ఆన్ డ్యూటీ), మానస రాధాకృష్ణన్ (హై వే), రితికా నాయక్ (అశోక వనంలో అర్జున కళ్యాణం), సంచిత బసు (ఫస్ట్ డే ఫస్ట్ షో), విర్తి వఘానీ (కొత్తకొత్తగా), సంజనా ఆనంద్ (నేను మీకు బాగా కావాల్సిన వాడిని), షిర్లే సేటియా (కృష్ణ వ్రింద విహారి), కయదు లోహర్ (అల్లూరి), సౌమ్య మీనన్ (లెహరాయి), కావ్యాశెట్టి (గుర్తుందా శీతాకాలం) తదితరులు తెలుగువారికి పరిచయం అయ్యారు. ఒకనాటి బాలనటి కావ్య కళ్యాణ్ రామ్ ‘మసూద’లో హీరోయిన్ గా నటించింది, ‘దిల్’ రాజు బ్యానర్ నుండి రాబోతున్న ‘బలగం’లోనూ నాయికగా నటిస్తోంది. తొలి చిత్రం ‘ఐరావతం’ మూవీలోనే తన్వీ నాగి ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీర్నా మీనన్.. ‘అల్లరి’ నరేశ్ ‘ఉగ్రం’లోనూ నాయికగా నటిస్తోంది. ‘నా వెంట పడుతున్న చిన్నవాడెవరమ్మా’ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన అఖిల ఆకర్షణ ‘ఏపీ 04 రామాపురం’లోనూ నటించింది. ఇలా ఈ యేడాది చాలామంది హీరోయిన్లు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు కానీ అందులో అదృష్టం కొందరినే వరించింది.