బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 21 మంది సభ్యుల మధ్య నిదానంగా నిప్పు రాజుకోవడం మొదలైంది. మరీ ముఖ్యంగా చలాకీ చంటీ ప్రవర్తనతో సింగర్ రేవంత్ అసహనానికి గురి అవుతున్నాడు. ఎదుటి వాళ్ళ మీద తరుచూ జోక్స్ వేసే చంటి… అతనిపై ఎవరైనా జోక్ వేస్తే తట్టుకోలేకపోతున్నాడని, తనను కావాలని అందరి ముందు అవమానించేలా ప్రవర్తిస్తున్నాడని రేవంత్ ఆరోపిస్తున్నాడు. బిగ్ బాస్ షో మొదలైనప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆ మూవీ హీరోహీరోయిన్లు రణబీర్ కపూర్, అలియా భట్ రాగా.. ఇప్పుడు మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోకి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ జోడీ సుధీర్ బాబు, కృతీశెట్టి వచ్చారు.
ఈ సందర్భంగా హౌస్ లో ఉన్న వాళ్ళకు యాక్టింగ్ విషయంలో కొన్ని టాస్క్ లు ఇచ్చారు. మహేశ్ బాబు డైలాగ్స్ చెప్పిన రేవంత్ ను సుధీర్ బాబు అభినందించాడు. అయితే వెనక నుండి చంటి కామెంట్ చేయడం రేవంత్ కు కోపాన్ని తెప్పించింది. సింగర్ అయిన తాను యాక్టింగ్ చేయలేనని, అయినా ప్రయత్నిస్తుంటే చంటీ ఎగతాళి చేశాడని రేవంత్ బాధపడ్డాడు. ఒక్కసారి తాను సహనాన్ని పక్కన పెట్టి ఎదురు తిరగడం మొదలెడితే, తన ముందు ఎవరూ నిలబడలేరంటూ రేవంత్ లెక్చర్ దంచాడు. ఇదిలా ఉంటే… ఆర్జే సూర్య తనదైన స్టయిల్ లో విజయ్ దేవరకొండ, గీతూ రాయల్ మాదిరి మాట్లాడి ఆకట్టుకున్నాడు. గీతూ రాయల్ కూడా చిన్నపిల్లల వాయిస్ ను ఇమిటేట్ చేసి మెప్పించింది. ఇలా కొంతమందితో కొన్ని స్కిట్స్ చేయించిన సుధీర్ బాబు, కృతీశెట్టి… ఫైనల్ గా బెస్ట్ యక్టర్ గా శ్రీహాన్ కు,బెస్ట్ యాక్ట్రస్ గా శ్రీసత్యను ఎంపిక చేసి అభినందించారు. రెండు మూడు రోజుల పాటు సిసింద్రీ టాస్క్ తో సెంటిమెంట్ ను వరదలా పారించిన బిగ్ బాస్ శుక్రవారం మాత్రం వినోదానికి పెద్ద పీట వేసి వ్యూవర్స్ ను తిరిగి తనవైపు తిప్పుకున్నాడు