(జనవరి 24న నటి కృష్ణకుమారి వర్ధంతి)
అందాల రాజకుమారి పాత్రల్లో అలరించిన నాయికలు ఎందరో ఉన్నారు. కానీ, కృష్ణకుమారిలా మురిపించిన వారు అరుదనే చెప్పాలి. జానపద కథానాయకులుగా యన్టీఆర్, కాంతారావు రాజ్యమేలుతున్న రోజుల్లో వారి సరసన కృష్ణకుమారి పలు చిత్రాలలో నాయికగా నటించి మురిపించారు. ముఖ్యంగా బి.విఠలాచార్య జానపద చిత్రాల్లో అనేక సార్లు రాజకుమారిగా నటించి మురిపించారు కృష్ణకుమారి. అందుకే ఈ నాటికీ అందాల రాజకుమారిగా జనం మదిలో నిలచిపోయారు కృష్ణకుమారి.
కృష్ణకుమారి 1933 మార్చి 6న జన్మించారు. తెలుగు వారే అయినా ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా కలకత్తాలో పనిచేయడం వల్ల అక్కడి నైహతిలో ఆమె జన్మించారు. ప్రముఖ నటి షావుకారు జానకికి స్వయానా చెల్లెలు కృష్ణకుమారి. ‘షావుకారు’లో నటిస్తున్న సమయానికే జానకి ఓ బిడ్డ తల్లి. షూటింగ్ లో అక్కకు తోడుగా ఉంటూ, ఆమె బిడ్డను ఆడిస్తూ ఉండేవారు కృష్ణకుమారి. ఆ సమయంలోనే కృష్ణకుమారి అందం పలువురు నిర్మాతలు, దర్శకులను ఆకట్టుకుంది. ‘నవ్వితే నవరత్నాలు’లో తొలిసారి కృష్ణకుమారి నటించారు. ఆ తరువాత కొన్ని కన్నడ, తమిళ చిత్రాలలోనూ కృష్ణకుమారి అభినయించారు. యన్టీఆర్ తమ ఎన్.ఏ.టి. బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’ లో కృష్ణకుమారికి నాయికగా అవకాశమిచ్చారు. ఇదే ఆమె తొలిసారి పూర్తి స్థాయిలో నాయికగా నటించిన తెలుగుసినిమా. తరువాత వరుసగా యన్టీఆర్ హీరోగా నటించిన “వినాయక చవితి, వీరకంకణం, దీపావళి” చిత్రాల్లో ఆయన సరసన నటించారు కృష్ణకుమారి. ‘పెళ్ళికానుక’లో ఏయన్నార్ సరసన జోడీగా కనిపించారు. ఆ తరువాత అక్కినేనితో కలసి “భార్యాభర్తలు, కులగోత్రాలు, వాగ్దానం, జమీందార్” వంటి సినిమాల్లో అభినయించారు. ఈ సినిమాలన్నీ కృష్ణకుమారికి మంచి పేరు సంపాదించిపెట్టాయి.
యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరి సరసన కృష్ణకుమారి వరుసగా నటించడానికి ఆ రోజుల్లో ఆ ఇద్దరు హీరోలు జమునను ఏదో కారణంగా తమ చిత్రాలలో నటింప చేయలేదు. ఆ సినిమాలన్నిటా కృష్ణకుమారిని నాయికగా ఎంచుకున్నారు. సదరు చిత్రాలే కృష్ఖకుమారికి మంచి పేరు సంపాదించిపెట్టడం విశేషం. అక్కినేని సరసన కృష్ణకుమారి నాయికగా నటించిన “పునర్జన్మ, అంతస్తులు” ఆమెకు నటిగా మంచిపేరు ఆర్జించాయి. ఇక యన్టీఆర్ జోడీగా కృష్ణకుమారి నటించిన “లక్షాధికారి, గుడిగంటలు, బందిపోటు, అగ్గి-పిడుగు, ఇరుగు-పొరుగు, ఉమ్మడికుటుంబం, వరకట్నం” వంటి చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. యన్టీఆర్ హిట్ పెయిర్ గా అలరించారామె. అప్పటి నూతన నటుడు కృష్ణంరాజు సరసన ‘చిలకా గోరింకా’లోనూ నాయికగా నటించారు. 1970ల ఆరంభానికే కృష్ణకుమారి అక్క, వదిన, అమ్మ పాత్రలు పోషించసాగారు. ఆ తరువాత కన్నడ, తమిళ చిత్రాలలోనే ఆమె ఎక్కువగా కనిపించారు. 2003లో దాసరి నారాయణరావు రూపొందించిన ‘ఫూల్స్’ లో చాలా ఏళ్ళ తరువాత కృష్ణకుమారి నటించారు. అదే ఆమె చివరి చిత్రం.
ఖైతాన్ అదినేత అజయ్ మోహన్ ఖైతాన్ ను వివాహమాడిన కృష్ణకుమారి, దీపిక మయ్యా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. చాలా ఏళ్ళ క్రితమే బెంగలూరులో నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడే కృష్ణకుమారి తుదిశ్వాస విడిచారు. ఈ నాటికీ ఆ నాటి అభిమానుల మదిలో రాజకుమారిగానే నిలిచారు కృష్ణకుమారి.