ఇప్పటి కాలంలో టాలీవుడ్ రియల్ మల్టీస్టారర్ గా తెరకెక్కి అద్భుతమైన కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకుంది రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, చరణ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు టీమ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇండియన్ సెలబ్రిటీలతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా ఆకట్టుకుంది. ఇందులో నటించిన ఎన్టీఆర్ కు ఆస్కార్ నామినేషన్ లో కూడా ఎంట్రీ లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆ సినిమా శాటిలైట్ లో ప్రసారం అయింది. టెలివిజన్ లో సైతం రికార్డులను క్రియేట్ చేస్తుందని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. స్టార్ మాలో తెలుగు వెర్షన్ తొలిసారి ప్రసారం చేయగా మంచి రేటింగ్ అందుకుంది. కానీ అందరూ ఎదురు చూసిన విధంగా రికార్డులను క్రియేట్ చేయలేకపోయింది. ఆశ్చర్యకరంగా టాప్ టెన్ లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ చోటు దక్కించుకోలేక పోవడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ టైమ్ టెలివిజన్ ప్రసారంలో 19.62 టిఆర్ పి ని సాధించింది.
ఇక ఇప్పటికీ బన్నీ నటించిన ‘అల..వైకుంఠపురములో’ సినిమా 29.4 టిఆర్ పీతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు 23.4 టీఆర్పీతో రెండో స్థానంలోను, బాహుబలి సెకండ్ పార్ట్ 22.7తో మూడో ప్లేస్ లో, శ్రీమంతుడు 22.54 టిఆర్ పీతో నాలుగో ప్లేస్ లో పుష్ప 22.54 పాయింట్స్ తో ఐదో స్థానంలో, డీజే 21.7 టిఆర్ పీతో ఆరో ప్లేస్ లో, బాహుబలి ఫస్ట్ పార్ట్ 21.54 తో ఏడో స్థానంలో, ఫిదా 21.31 టీఆర్ పీతో ఎనిమితో ప్లేస్ లో, గీతగోవిందం 20.8 టిఆర్ పీతో తొమ్మిదో స్థానంలో, జనతా గ్యారేజ్ 20.69 టిఆర్పీతో పదో ప్లేస్ లో నిలిచాయి. ‘ఆర్ఆర్ఆర్’ మాత్రం టాప్ టెన్ లో ప్లేస్ చేజిక్కించుకోలేక పోయింది. ఓటీటీ లో ఈ సినిమాను ఇప్పటికే ఒకటికి రెండు చూసి ఉండటమే అందుకు కారణమని భావిస్తున్నారు. దాంతో టెలివిజన్ లో ఆశించిన టీఆర్పీని పొందలేకపోయిందన్నది వాస్తవం. శాటిలైట్ పై ఓటీటీ అంతలా ప్రభావం చూపించిందన్నమాట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆస్కార్ ఎంట్రీ సాధిస్తే శాటిలైట్ రిపీట్ రన్స్ కి ఎంతో కొంత మేలు జరుగుతుంది. మరి ఏమవుతుందో చూడాలి.