Sukumar – DSP: స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు వీరి కాంబినేషన్‌లో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం RC17 కోసం కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని అందరూ అనుకున్నప్పటికీ, తాజాగా పరిస్థితులు మారుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి పనిచేస్తున్న పలు చిత్రాల బృందాలు శుభాకాంక్షలు తెలిపాయి. అయితే RC17 టీమ్ మాత్రం ఎలాంటి పోస్ట్ చేయకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య గత కొంతకాలంగా సంబంధాలు అంత సాఫీగా లేవనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ‘పుష్ప’ సమయంలో మొదలైన కొన్ని విభేదాలు, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వరకు కొనసాగాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ధురంధర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్‌ను RC17 కోసం పరిశీలిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, సుకుమార్ కెరీర్‌లో దేవిశ్రీ ప్రసాద్ లేకుండా తెరకెక్కనున్న తొలి సినిమా RC17 అవుతుంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

