Ravi Teja : ‘ఇరుముడి’ తర్వాత రవితేజ డబుల్ ట్రీట్..

Raviteja

Raviteja

వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రవితేజ,. ఒకవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుండగా, ఇప్పుడు ఏకంగా ఇద్దరు యంగ్ అండ్ ప్రామిసింగ్ డైరెక్టర్లను ఒకేసారి పట్టేయడం ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు సినిమాలూ విభిన్నమైన జోనర్లలో ఉండబోతున్నట్లు సమాచారం.

దర్శకుడు వివేక్ ఆత్రేయ నిజానికి నందమూరి బాలకృష్ణ కోసం ఒక పవర్‌ఫుల్ మాస్ కథను సిద్ధం చేసి, ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ కూడా పొందారు. అయితే, బాలయ్య ప్రస్తుతం తన రాజకీయ, ఇతర సినిమా కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యేలా ఉంది. ఈ గ్యాప్‌ను వృథా చేయకూడదని భావించిన వివేక్, ఆ కథను రవితేజకు వినిపించగా.. ఆయనకు కూడా బాగా నచ్చి వెంటనే షూటింగ్‌కు ఓకే చెప్పేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.

మరోవైపు, ‘రాజ రాజ చోర’ వంటి వైవిధ్యమైన చిత్రంతో మెప్పించిన హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ మరో సినిమా చేయబోతున్నారు. దిల్ రాజు సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. విశేషం ఏమిటంటే, వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి సినిమాల షూటింగ్స్‌ను రవితేజ సమాంతరంగా (ఒకే సమయంలో) జరపాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు టైటిల్స్ వెలువడనున్నాయి. మొత్తానికి ‘ఇరుముడి’తో పాటు ఈ రెండు సినిమాలు కూడా రవితేజ మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.