Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్

Rashmika Mandanna

Rashmika Mandanna

సినిమా రంగంలో హీరోయిన్ల ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హద్దులు, తెరపై పాత్రల రూపురేఖలు, వేసే దుస్తుల విషయంలో హీరోయిన్లు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ప్రముఖ సినీ నిర్మాత, టాక్ షో హోస్ట్ కరణ్ జోహార్‌తో జరిగిన ఓ ముఖాముఖిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్ పరిమితులు, గ్లామర్ షోపై స్పష్టమైన, నిర్మొహమాటమైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ వస్త్రధారణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కరణ్ జోహార్, పక్కనే ఉన్న విజయ్ దేవరకొండతో కలిసి, రష్మికను ఈ ఇబ్బందులు ఎప్పుడైనా ఎదురయ్యాయా అనే విషయంపై ప్రశ్నించాడు.

“దర్శకనిర్మాతలతో పని చేసేటప్పుడు దుస్తుల ఎంపిక, పాత్రల ప్రదర్శన విషయంలో మీరు ఏమైనా హద్దులు గీసుకుంటారా?” అని కరణ్ అడిగిన ప్రశ్నకు రష్మిక పరిణతితో కూడిన సమాధానమిచ్చారు. తెరపై తాను కనిపించే విధానంపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని రష్మిక స్పష్టం చేశారు. కొన్ని పాత్రలకు బికినీ లేదా బోల్డ్ దుస్తులు కథాపరంగా అవసరం కావొచ్చని, అయితే వ్యక్తిగతంగా తనకు మితిమీరిన ఎక్స్‌పోజింగ్ లేదా స్కిన్ షో చేయడం ఏమాత్రం ఇష్టం ఉండదని ఆమె వివరించారు. “కొన్ని విషయాల్లో నేను అస్సలు రాజీపడను; సహజంగానే నేను అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాదు” అని తేల్చిచెప్పారు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్నప్పుడు కథానాయికలకు కొన్ని ప్రత్యేక డిమాండ్లు ఎదురవుతుంటాయి.

పాటలు, గ్లామరస్ సన్నివేశాల్లో కొన్ని రకాల కాస్ట్యూమ్స్ ధరించాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి పూర్తి సౌకర్యంగా అనిపించకపోవచ్చని ఆమె అంగీకరించారు. కానీ అలాంటి పరిస్థితుల్లోనూ తాను ఎక్కడ ఆగాలో తనకు తెలుసని, తనకంటూ కొన్ని స్పష్టమైన హద్దులను స్వయంగా నిర్ణయించుకుంటానని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న రష్మిక, స్టార్‌డమ్ కోసం వ్యక్తిగత సౌకర్యాన్ని, విలువలని వదులుకోబోనని చెప్పడం ఆమెలోని పరిణతికి అద్దం పడుతోంది. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా తనకంటూ ఒక గీత గీసుకుని ముందుకు సాగుతున్న ఆమె విధానం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ విశేషంగా ఆకట్టుకుంటోంది.