టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ‘బాహుబలి’ బాలీవుడ్‌కు ఇన్‌స్పిరేషన్ ఇచ్చినట్లుంది. అందుకే బాలీవుడ్‌లో చాన్నాళ్లకు సోషియో ఫాంటసీ మూవీ వస్తోంది. ఆ సినిమానే బ్రహ్మాస్త్ర. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తెలుగులో ఈ మూవీ ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాను బాహుబలి తరహాలో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. తెలుగులో తొలి భాగానికి శివ అని నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్ర తెలుగు ట్రైలర్‌కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ అందించారు. నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి.. ఈ కథ ఈ అస్త్రాలన్నింటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది అంటూ చెప్పే చిరు వాయిస్ చాలా గంభీరంగా ఉంది.
ట్రైలర్‌లో రణ్‌బీర్ కపూర్‌ను సాధారణ యువకుడిగా పరిచయం చేశారు. ఆలియాతో అతను ప్రేమలో పడటం, ఆ తర్వాత తనకు అగ్ని శక్తి ఉందని తెలుసుకోవడం వంటి అంశాలను చూపించారు. అయితే లోకంలో చెడును అతడు ఎలా అంతం చేశాడన్నదే మెయిన్ కథగా కనిపిస్తోంది. ముఖ్యంగా లవ్, లైట్, ఫైర్ ప్రధాన అంశాలుగా బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌లో వెల్లడించారు. ట్రైలర్‌లో చూపించిన గ్రాఫిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథాంశం. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు. తెలుగులో ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాను సమర్పిస్తున్నాడు. సెప్టెంబర్ 9న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.